గ్రామపంచాయతీ కార్మికుల ధర్నా
విశ్వంభర, మహబూబాబాద్: గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని జిల్లా కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ముందు గ్రామపంచాయతీ సంఘం జిల్లా నాయకులు ధర్మారం సుధాకర్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు . ధర్నాని ఉద్దేశించి కుమ్మరి కుంట్ల నాగన్న మాట్లాడుతూ, ప్రతీనెల రెండో తారీఖు నాడు గతంలో ఇచ్చిన మాదిరిగానే గ్రామపంచాయతీ కార్మికులకు వారి వ్యక్తిగత ఖాతాలో వేతనాలు జమ చేయాలని రాష్ట్రంలో రోజు కు రోజు ఎండ తీవ్రత పెరుగుతున్నందున కార్మికులకు ఒక పూట పనిని అమలు చేయాలని కోరారు. రాష్ట్రంలో సుమారు 60 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారని గుర్తు చేసారు. పారిశుధ్య కార్మికులకు పని భద్రత లేదు, పర్మిట్ లేదు, కనీస వేతనాలు లేవు, ఈఎస్ఐపిఎఫ్ సౌకర్యం లేదు , ప్రమాద బీమా సౌకర్యం లేదని నన్నారు. వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు కావడం లేదు, అంతేకాకుండా గ్రామపంచాయతీ సిబ్బంది కేవలం నెలకు 9,500 ఇచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వం వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి వీరికి కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని, సమాన పనికి సమాన వేతనo ఇవ్వాలని, ప్రభుత్వ ఉద్యోగుల గా గుర్తించాలని, పనిచేస్తున్న సందర్భంలో కార్మికుడు ప్రమాదంలో మరణిస్తే వారికి 25 లక్షల రూపాయలు తక్షణమే ఇవ్వాలని, మట్టి ఖర్చుల కింద 50 వేల రూపాయలు ఇవ్వాలని, ఆయన కోరారు . ఈ సమస్యలన్నీ తక్షణమే పరిష్కరించాలని లేకుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికులందరినీ సమీకరించి పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.



