నగర గ్రంథాలయ సమస్యలపై జిహెచ్‌ఎంసి కమిషనర్‌కు వినతి

నగర గ్రంథాలయ సమస్యలపై జిహెచ్‌ఎంసి కమిషనర్‌కు వినతి

విశ్వంభర, హైదరాబాదు:  నగర గ్రంథాలయ సంస్థకు సంబంధించిన పలు ముఖ్య సమస్యలపై జిహెచ్‌ఎంసి కమిషనర్ ఆర్.వి. కరణ్‌ను అశోక్ నగర్ లోని నగర గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేసిరెడ్డి ఉపేందర్ రెడ్డి, కార్యదర్శి పొట్లూరి పద్మజ కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగర గ్రంథాలయానికి నూతన భవన నిర్మాణం చేపట్టేందుకు ఇప్పటికే పూర్తయిన పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులను త్వరితగతిన మంజూరు చేయాలని కోరారు. అలాగే ప్రజలకు ఉపయోగపడే విధంగా ఇందిరమ్మ కాంటీన్ ఆధ్వర్యంలో ఐదు రూపాయల మిల్లెట్స్ క్యాంటీన్‌ను గ్రంథాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల ప్రారంభమైన చాచా నెహ్రూ పార్క్ గ్రంథాలయాన్ని అధికారికంగా నగర గ్రంథాలయ సంస్థకు అప్పగించాలని వినతిపత్రంలో ప్రస్తావించారు. నగర గ్రంథాలయ సంస్థకు రావలసిన సెస్సును మంజూరు చేసి పెండింగ్ బిల్లులకు సంబంధించిన చెక్కులను త్వరగా విడుదల చేయాలని కోరారు. నగర గ్రంథాలయ సంస్థ పరిధిలో నిర్మాణంలో ఉన్న గ్రంథాలయ భవనాలకు సంబంధించిన బిల్లులను విడుదల చేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 99 రోజుల ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా ఆ భవనాలను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మరమ్మతులు జరుగుతున్న గ్రంథాలయ భవనాలకు సంబంధించిన బిల్లులను కూడా త్వరగా విడుదల చేయాలని తెలిపారు. వినతిపత్రాన్ని స్వీకరించిన జిహెచ్‌ఎంసి కమిషనర్ ఆర్.వి. కరణ్ నగర గ్రంథాలయ సంస్థకు నూతన భవన నిర్మాణానికి సంబంధించిన పెండింగ్ బిల్లులను త్వరలో మంజూరు చేస్తామని, గ్రంథాలయాల అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

Tags: