ఐబొమ్మ రవికి హైకోర్టులో ఊరట.. షరతులతో కూడిన బెయిల్ మంజూరు

ఐబొమ్మ రవికి హైకోర్టులో ఊరట.. షరతులతో కూడిన బెయిల్ మంజూరు

 చలనచిత్ర పరిశ్రమను కుదిపేసిన పైరసీ వెబ్‌సైట్ నిర్వాహకుడు రవికి ఎట్టకేలకు ఊరట లభించింది. 

విశ్వంభర, తెలంగాణ బ్యూరో: చలనచిత్ర పరిశ్రమను కుదిపేసిన పైరసీ వెబ్‌సైట్ నిర్వాహకుడు రవికి ఎట్టకేలకు ఊరట లభించింది. సుదీర్ఘ కాలంగా జైలు జీవితం గడుపుతున్న రవికి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ మంజూరైనప్పటికీ, కొన్ని కఠినమైన నిబంధనలను కోర్టు విధించింది. రవి ప్రతిరోజూ సంబంధిత పోలీసు స్టేషన్ (సీపీఎస్) ఎదుట హాజరు కావాలని, దేశం విడిచి వెళ్లకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా, తన పాస్‌పోర్టును వెంటనే పోలీసులకు అప్పగించాలని కోర్టు ఆదేశించింది.

వేల కోట్ల నష్టం.. అండమాన్‌లో అరెస్ట్
సినిమాలను అక్రమంగా పైరసీ చేస్తూ పరిశ్రమకు వేల కోట్ల రూపాయల నష్టం కలిగించాడనే ఆరోపణలతో రవిని గత ఏడాది నవంబర్ 16న పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ పైరసీ దందా ద్వారా రవి కోట్ల రూపాయల అక్రమ సంపాదన గడించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. పోలీసుల కళ్లుగప్పి అండమాన్ దీవుల్లోని ఒక ఐలాండ్‌లో దాక్కున్న రవిని గుర్తించి, అక్కడి నుంచి హైదరాబాద్‌కు తరలించారు. అరెస్ట్‌కు ముందు పోలీసులకు సవాల్ విసిరిన రవి వ్యవహారం అప్పట్లో సంచలనం సృష్టించింది.

Read More జీఎస్టీ సంస్కరణలు – దేశంలో విప్లవాత్మక మార్పుకు నాంది. – ఎం. వెంకయ్య నాయుడు

నెట్టింట రవికి మద్దతు.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్
రవి అరెస్ట్ తర్వాత సోషల్ మీడియాలో ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. పలువురు నెటిజన్లు రవికి మద్దతుగా నిలవడం హాట్ టాపిక్‌గా మారింది. థియేటర్లలో సినిమా టికెట్ల ధరలు, ఆహార పదార్థాలు, నీళ్ల బాటిళ్ల ధరలు సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో రవిని హీరోతో పోల్చుతూ, సామాన్యుడికి అందుబాటులో సినిమాలు చూపిస్తున్నాడంటూ అతడికి పొగడ్తలు కురిపించడం గమనార్హం.