నిజాయతీకి నిలువుటద్దం ఈ తహశీల్దార్

నిజాయతీకి నిలువుటద్దం ఈ తహశీల్దార్

నిజాయతీకి నిలువుటద్దం సిద్దిపేట రూరల్ తహశీల్దార్ సీహెచ్ స్వామి. రూల్స్‌కు పెట్టింది పేరు. పైరవీకారులను తరిమికొట్టే రకం. అవినీతి వాసనంటే పడదు. కార్యాలయంలో పని ఉంటే ఆదివారం కూడా పనిచేసే రకం. 
రైతులకు భూమి అంటే ఒక ఎమోషనల్. అలాంటి రైతులకు న్యాయం చేయకపోతే నేనుందుకు. ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పోల్చితే ఇక్కడ భూసమస్యలు చాలా తక్కువ. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉందని చెబుతున్న ఎమ్మార్వో స్వామితో విశ్వంభర ప్రతినిధి ముఖాముఖి.
 
విశ్వంభర ప్రతినిధి: ఇంటర్వ్యూలోకి వెళ్లే ముందు మీ కుటుంబ నేపథ్యం గురించి వివరించండి?
తహశీల్దార్: అమ్మనాన్న లక్ష్మి-అడవయ్య, ముగ్గురు అన్నదమ్ములు. అన్నయ్య పీజీటీ టీచర్‌గా పనిచేస్తున్నాడు. మధ్యలో నేను. తమ్ముడు బిజినెస్ వైపు స్థిరపడ్డాడు. మా మేడం ఎమ్మెస్సీ కంప్లీట్. బాబు విహాన్, పాప దేవాన్షిని. స్వస్థలం గంభీరావుపేట మండలం, సిరిసిల్ల జిల్లా.   
 
విశ్వంభర: ఇటీవల నిర్వహించిన భూభారతి సదస్సులో ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? ఎన్ని పరిష్కరించారు. పెండింగ్‌లో ఎన్ని ఉన్నాయి.?
తహశీల్దార్: 1674 దరఖాస్తులు వచ్చాయి. అందులో 98మందికి పాసుబుక్‌లు ఇచ్చాం. మిగతా 701 రిజెక్ట్ చేశాం. 564 ప్రాధాన్యాత క్రమంలో పెండింగ్‌లో ఉన్నాయి. 122ప్రభుత్వ భూములకు సంబంధించినవి. 189మంది అసెన్డ్‌మెంట్ భూములను కొన్నవారు. ఫీల్డ్ ఇంక్వైరీలో ఉన్నాయి. ప్రభుత్వం నిర్ణయం మేరకు వాటిని కూడా పరిష్కరిస్తాం. 
 
విశ్వంభర: సాదాబైనామా దరఖాస్తులను ఏ విధంగా పరిష్కరిస్తున్నారు. అసలు వాటిని పట్టించుకోవడం లేదన్న ఓ విమర్శ బలంగా వినిపిస్తుంది?
తహశీల్దార్: 2459 దరఖాస్తులు వచ్చాయి. 2020 దరఖాస్తులను తిరస్కరించాం. 250ఫీల్డ్ ఇంక్వైరీలో ఉన్నాయి. ప్రభుత్వం నిర్ణయం ప్రకారం పరిష్కరిస్తాం.
 
విశ్వంభర: సాదాబైనామాలో యజమాని ఒప్పంద అంగీకార పత్రం సమర్పించాలని ఓ షరత్ ఉండేది? ప్రస్తుతం ఆ షరత్ ఉందా? తొలగించారా?
తహశీల్దార్: ప్రస్తుతానికైతే తొలగించలేదు. అంగీకార పత్రం ఉండాలి.
 
విశ్వంభర: మండలంలో ఏ గ్రామంలో మేజర్‌గా భూ సమస్యలున్నాయి? ఆ గ్రామ భూసమస్యలకు తీసుకుంటున్న చర్యలేంటీ? అవగాహన సదస్సులాంటివి ఏర్పాటు చేశారా?
తహశీల్దార్: మేజర్ భూసమస్యలున్న ఊర్లు లేవు. వందలో 98మందికి పాసుబుక్‌లు ఉన్నాయి. 
 
విశ్వంభర: రెవెన్యూ అధికారులంటే డబ్బులిస్తేనే పనిచేస్తారు? లేదంటే చేయరనే విమర్శ ఉంది?
దీనిపై మీ స్పందన?
తహశీల్దార్: సిబ్బంది డబ్బుల అడిగితే వెంటనే ఏసీబీకి ఫోన్ చేయాలి. లేదంటే డయల్ 100కు కాల్ చేయాలి. డయల్ 100లో కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. 
 
విశ్వంభర: పహణీలు తీసుకోవాలంటే ఎన్ని పేజీలకు ఎంత రుసుం కట్టాలి? ఆ రుసుం డబ్బులు ప్రభుత్వానికి ఏ విధంగా వెళ్తాయి?
తహశీల్దార్: పహణీలు తీసుకోవడానికి రెండు రకాలుంటాయి. ఒకటి బ్యాంక్‌లో డీడీ కట్టాలి. ఈ పద్ధతి రైతులకు  ఇబ్బందిగా ఉంటుంది. రెండోది మన కార్యాలయంలోనే ప్రింటర్ ఉంటుంది కాబట్టి బయట సాధారణ జిరాక్స్‌ల మాదిరిగానే డబ్బులు చెల్లిస్తే సరిపోతుంది. 
 
విశ్వంభర: కార్యాలయంలో సరిపడా సిబ్బంది ఉన్నారా? ఎంత మంది ఉన్నారు? డీటీ లేని భారం మీపై పడుతుందా?
తహశీల్దార్: సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. నాతోపాటు సీనియర్ అసిస్టెంట్, మీసేవ, భూభారతి ఆపరేటర్లు ఇద్దరు మాత్రమే ఉన్నారు. మిగితావన్నీ ఖాళీలు ఉన్నాయి. ఇద్దరు ఆర్ఐలకు ఒకరే ఉన్నారు. టైపిస్ట్, మరొక ఆర్ఐ, జూనియర్, రికార్డు అసిస్టెంట్స్, డీటీ, సర్వేయర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.  
 
విశ్వంభర: రెవెన్యూ అధికారులు సమయపాలన పాటించరని బలంగా వినిపించే విమర్శ? దీనిపై మీ స్పందన?
తహశీల్దార్: ఆఫీస్ టైమింగ్ 10.30 టూ సాయంత్రం 5గంటలు. అందరూ పాటిస్తున్నారు. కావాలంటే చెక్ చేసుకోవచ్చు. మరీ సాయంత్రం 5దాటినా పనిచేస్తుంటాం కదా దాని గురించి మాట్లాడరెందుకంటూ చిన్నగా నవ్వులు.   
 
విశ్వంభర: మీరు చాలా నిజాయతీ అని వినిపించింది. కానీ మీ నిజాయతీతో అర్హులైన లబ్దిదారులకు అన్యాయం జరిగిందనే మాటాలూ వినిపిస్తున్నాయి?
తహశీల్దార్: కార్యాలయానికి ఎంత మంది ఎక్కువగా వస్తే మేం అంతా ఫెయిల్ అయినట్టే. ప్రతీ దరఖాస్తును సాధ్యమైనంత వరకు తొందరగా పరిష్కరిస్తున్నాం. ఒకవేళ రిజక్ట్ చేస్తే ఎందుకు రిజక్ట్ చేస్తున్నామో లిఖితపూర్వకంగా రాసి ఇస్తున్నాం. 
 
విశ్వంభర: 2016-17కు సంబంధించి 13బీ రికార్డు ఫైల్ అందుబాటులో ఉందా? దొరికిందా?
తహశీల్దార్: ఫైల్ దొరకలేదు. అప్పటి ఎమ్మార్వో 13బీ ప్రొసీడింగ్స్ ఎందుకు ఆన్‌లైన్ చేయాలేదో అర్థం కావడం లేదు. అప్పుడు నేను ఖమ్మం జిల్లాలో పనిచేశాను. ‘ఆ సమయంలో అన్ని ప్రొసీడింగ్స్ ఆన్‌లైన్ చేశామంటూ చాలా ఫైల్స్ విశ్వంభర ప్రతినిధికి చూపెట్టడం గమనార్హం.’
 
విశ్వంభర: కుల, ఆదాయ ధృవీకరణ పత్రాల మంజూరులో ఆలస్యమవుతోందని బాధితులు ఆరోపణ?
తహశీల్దార్: పెండింగ్ లేవు. వెంటవెంటనే పరిష్కరిస్తున్నాం. అత్యవసరమైతే నన్ను నేరుగా కలవండి. 
 
విశ్వంభర: కొత్తగా వచ్చిన జీపీవోల పనితీరు ఎలా ఉంది?
తహశీల్దార్: జీపీవోల పనితీరు బాగుంది. వారు పని చేయకుంటే నేను దగ్గరుండి చేయిస్తానంటూ.. నవ్వులు.
 
విశ్వంభర: ఎన్ఎఫ్‌బీఎస్ పథకంపై గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన లేదు. దానికోసం తీసుకుంటున్న చర్యలేంటి?
తహశీల్దార్: మండల వ్యాప్తంగా 80మందిని గుర్తించాం. జీపీవోల ద్వారా వారిని పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించాం. ప్రస్తుతానికి ఒకరిద్దరూ మాత్రమే చేసుకున్నారు. వారికోసం మేమే ఇన్‌కమ్ సర్టిఫికెట్ రికమండ్ చేస్తాం. 
 
విశ్వంభర: రేషన్ దుకాణాలు, రైస్ మిల్లులు, సర్వే రాళ్ల తనిఖీలు ఒక్కసారి కూడా చేపట్టడం లేదు?
తహశీల్దార్: రేషన్ దుకాణాల్లో ఆన్‌లైన్ ద్వారానే బియ్యం సరఫరా అవుతుంది. కావున అప్పటి మాదిరిగా మోసం జరగడం లేదు. రైస్ మిల్లులను సివిల్ సఫ్లయ్ అధికారులు తనిఖీ చేస్తుంటారు. సర్వే రాళ్లను రైతులు సాగు సమయంలో చాలా వరకు చెరిపేశారు. సర్వేరాళ్లను సర్వేయర్ చూస్తుంటారు. ఇప్పుడు కొత్తగా వచ్చే సర్వేయర్లు ఆ బాధ్యతలు చూస్తారు.
 
విశ్వంభర: చివరగా మీ కెరియర్ ఎప్పుడు మొదలైంది? మొదటి పోస్టింగ్ ఎక్కడ?
తహశీల్దార్: 2012లో డీటీగా కెరియర్ ప్రారంభించాను. 2017 తహశీల్దార్‌గా ప్రమోషన్ వచ్చింది. అప్పటి నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే ఎక్కువగా పనిచేశాను. ప్రస్తుతం సిద్దిపేటలో 6నెలల నుంచి పనిచేస్తున్నాను.

Tags: