గ్రామీణ క్రీడా రంగానికి సాంకేతిక హంగులు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
రాష్ట్ర గ్రామీణ క్రీడా రంగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెండో విడత 'సీఎం కప్ 2025-26'కు సాంకేతిక హంగులు జతచేసింది.
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర గ్రామీణ క్రీడా రంగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెండో విడత 'సీఎం కప్ 2025-26'కు సాంకేతిక హంగులు జతచేసింది. మంగళవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఈ క్రీడా సంబరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రతిభను గుర్తించేందుకు సీఎం కప్ దోహదపడుతుందని పేర్కొన్నారు.
నీలమణి యాప్‌తో పారదర్శకత
క్రీడాకారులకు ఇష్టమైన సమాచార వ్యవస్థను అందుబాటులోకి తెచ్చినట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. 'నీలమణి' యాప్ ద్వారా, ఏఐ కాల్ సెంటర్ సహాయంతో 24 గంటల పాటు క్రీడాకారులకు అవసరమైన సమాచారాన్ని అందుబాటులో ఉంచడం అభినందనీయమన్నారు. ఈ డిజిటల్ వ్యవస్థ ద్వారా పోటీల షెడ్యూల్, ఫలితాలను సులభంగా తెలుసుకోవచ్చని చెప్పారు. గ్రామీణ మండల, అసెంబ్లీ, జిల్లా స్థాయిల్లో జరిగిన పోటీల్లో దాదాపు నాలుగున్నర లక్షల మంది క్రీడాకారులు పాల్గొన్నారని భట్టి విక్రమార్క హర్షం వ్యక్తం చేశారు. వీరిలో నుంచి 22,000 మంది క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని తెలిపారు. ఈ పోటీల్లో 44 క్రీడాంశాలను చేర్చినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, ఎండి డాక్టర్ సోని బాలాదేవి తదితరులు పాల్గొన్నారు.



