క్యాతనపల్లి చైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా
మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఉద్రిక్తతలకు దారితీసింది.
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఉద్రిక్తతలకు దారితీసింది. పీఠం దక్కించుకునేందుకు అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీలు నువ్వా నేనా అన్నట్లు పోటీ పడటంతో పోలింగ్ కేంద్రం వద్ద రణరంగం సృష్టించారు. ఘర్షణల నేపథ్యంలో ఎన్నిక మరోసారి వాయిదా పడింది. ఎక్స్ అఫీషియో ఓటు వినియోగించుకోవడానికి వచ్చిన కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ కాన్వాయ్‌పై బీఆర్ఎస్ మద్దతుదారులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో మంత్రి వివేక్ కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. ఈ ఘటనలో పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు, పోలీసులు గాయపడ్డారు.
హైటెన్షన్‌లో క్యాంపు రాజకీయాలు
మొత్తం 22 వార్డులు ఉన్న ఈ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ 10, కాంగ్రెస్ 7, సీపీఐ 4, ఇండిపెండెంట్ 1 స్థానాలను గెలుచుకున్నాయి. 2 ఎక్స్ అఫీషియో ఓట్లతో కాంగ్రెస్ బలం కూడా 10కి చేరింది. ఇరు పార్టీల బలం సమానంగా ఉండటంతో చైర్మన్ పీఠం కోసం తీవ్ర పోటీ నెలకొంది. ఈ ఎన్నిక మంత్రి వివేక్‌కు ప్రతిష్టాత్మకంగా మారగా, బీఆర్ఎస్ కూడా అంతే స్థాయిలో పోటీ ఇస్తోంది. ఈ క్రమంలో, కౌన్సిలర్లను కాపాడుకునేందుకు ఇరు పార్టీలు క్యాంపు రాజకీయాలకు తెరలేపాయి. పట్టణంలో ఐదు అంచెల భద్రతను ఏర్పాటు చేశారు.



