క్షేత్రస్థాయికి రండి.. లేదంటే సస్పెన్షన్లే: సీఎం రేవంత్ రెడ్డి

క్షేత్రస్థాయికి రండి.. లేదంటే సస్పెన్షన్లే: సీఎం రేవంత్ రెడ్డి

 మున్సిపల్ అధికారులు, కమిషనర్లు క్షేత్రస్థాయిలోకి వెళ్లడం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మంగళవారం సచివాలయంలో పురపాలక పరిపాలన, పట్టణాభివృద్ధిశాఖపై నిర్వహించిన సమీక్షలో ఆయన అధికారులపై సీరియస్ అయ్యారు. 

విశ్వంభర, తెలంగాణ బ్యూరో: మున్సిపల్ అధికారులు, కమిషనర్లు క్షేత్రస్థాయిలోకి వెళ్లడం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మంగళవారం సచివాలయంలో పురపాలక పరిపాలన, పట్టణాభివృద్ధిశాఖపై నిర్వహించిన సమీక్షలో ఆయన అధికారులపై సీరియస్ అయ్యారు. కమిషనర్లు, జోనల్ కమిషనర్లు ఉదయం వేళ ఖచ్చితంగా ఫీల్డ్‌లో ఉండి పారిశుధ్య పనులను పర్యవేక్షించాలని ఆదేశించారు. నగరంలో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. త్వరలో తానే స్వయంగా ప్రతి జోన్‍లో పర్యటిస్తానని, రోడ్లు శుభ్రంగా లేకపోతే బాధ్యులైన అధికారులను అక్కడిక్కడే సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. జీహెచ్ఎంసీ విభజన కారణంగా తలెత్తిన పలు సమస్యలను పరిష్కరించాలని సూచించారు.

పీపీపీ విధానంలో మౌలిక సదుపాయాలు
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను అధిగమించడానికి పీపీపీ విధానంలో స్కైవాక్ బ్రిడ్జిలను ఏర్పాటు చేసే అంశాన్ని అధ్యయనం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. అలాగే, నెక్లెస్ రోడ్ రైల్వే స్టేషన్ సమీపంలో మల్టీలెవల్ కార్ పార్కింగ్ ఏర్పాటు చేయాలని, జంక్షన్ల వద్ద స్మార్ట్ పోల్స్ ఏర్పాటుపై దృష్టి సారించాలని సూచించారు.

Read More నకిరేకల్ ఎమ్మెల్యే తో రాపోలు భేటీ.  చేనేత సమస్యలపై చర్చ. 

ప్రకటనల బోర్డుల ద్వారా ఆదాయం పెంపు
అడ్వర్టైజింగ్ బోర్డుల నిర్వహణపై జాగ్రత్తలు తీసుకోవాలని, దీనివల్ల ప్రభుత్వానికి వచ్చే ఆదాయానికి గండి పడకుండా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వ కార్యక్రమాల కోసం 10 శాతం ప్రకటన బోర్డులను కేటాయించాలన్నారు. అన్ని ప్రకటనల బోర్డుల నుండి సంవత్సరానికి ఒకసారి ఫీజు వసూలు చేయాలని, అనధికార బోర్డులను తొలగించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ప్రజా ప్రతినిధులకు శిక్షణ
రాష్ట్రంలో నూతనంగా ఎన్నికైన మేయర్లు, డిప్యూటీ మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లకు పట్టణ పరిపాలనపై ఒక రోజు శిక్షణ ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఈ సమీక్షలో సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎంఓ సెక్రటరీ మాణిక్‌రాజ్, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.