తెలంగాణ ఈఏపీసెట్ 2026.. ఇక మొబైల్‌లోనే దరఖాస్తు
రాష్ట్రంలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఈఏపీసెట్ దరఖాస్తుల ప్రక్రియను ఈ ఏడాది మరింత సులభతరం చేశారు.
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఈఏపీసెట్ దరఖాస్తుల ప్రక్రియను ఈ ఏడాది మరింత సులభతరం చేశారు. దరఖాస్తు నుంచి పరీక్షల నిర్వహణ వరకు ఎలాంటి తప్పులు దొర్లకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నామని జేఎన్‌టీయూ రెక్టార్, ఈఏపీసెట్ కన్వీనర్ విజయ్‌కుమార్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో EAPCET పరీక్షలు మే 4వ తేదీ నుంచి ప్రారంభమై మే 11 వరకు కొనసాగనున్నాయి. షెడ్యూల్ ప్రకారం.. మే 4, 5 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మా ప్రవేశ పరీక్షలు, మే 9 నుంచి 11 వరకు ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షలు ఉదయం, మధ్యాహ్నం రెండు షిఫ్టుల్లో జరగనున్నాయి.
మొబైల్ ద్వారా దరఖాస్తు
ఈ ఏడాది మొట్టమొదటిసారిగా విద్యార్థులు తమ మొబైల్ ఫోన్ల ద్వారానే EAPCETకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించామని విజయ్‌కుమార్ రెడ్డి పేర్కొన్నారు. అంతేకాకుండా, పరీక్ష పూర్తయిన వెంటనే విద్యార్థుల ప్రతిభ ఆధారంగా ప్రిలిమినరీ మార్కులు స్క్రీన్‌పై డిస్‌ప్లే అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన వివరించారు. దీనివల్ల విద్యార్థులు రిజల్ట్స్ కోసం ఎదురుచూడకుండా, గతేడాది ర్యాంకులతో పోల్చుకుని తమకు ఏ ర్యాంక్ రావచ్చో అంచనా వేసుకోవచ్చు, తద్వారా వారిలో ఆందోళన తగ్గుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఎడిట్ ఆప్షన్.. స్టూడెంట్ ఫ్రెండ్లీ కేంద్రాలు
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ సమయంలో తప్పులు దొర్లితే సరిదిద్దుకోవడానికి విద్యార్థులకు "ఎడిట్ ఆప్షన్" అందుబాటులో ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. అలాగే, స్టూడెంట్ ఫ్రెండ్లీ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. డయాబెటిస్, జ్వరం వంటి ఆరోగ్య సమస్యలు ఉన్న విద్యార్థులకు కేంద్రాల్లో తక్షణ వైద్య సాయం అందించేలా చర్యలు తీసుకుంటున్నామని విజయ్‌కుమార్ రెడ్డి తెలిపారు.



