అమెరికాతో వాణిజ్య ఒప్పందం చారిత్రకం: చంద్రబాబు
భారత్-అమెరికా దేశాల మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం ప్రపంచ ఆర్థిక స్థిరత్వానికి ఒక కీలక మైలురాయి అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొనియాడారు.
విశ్వంభర, ఏపీ బ్యూరో: భారత్-అమెరికా దేశాల మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం ప్రపంచ ఆర్థిక స్థిరత్వానికి ఒక కీలక మైలురాయి అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొనియాడారు. ఈ బృహత్తర కార్యాన్ని విజయవంతంగా పూర్తి చేసినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు. దిగుమతి సుంకాలను 18 శాతానికి* తగ్గించడం ద్వారా ప్రపంచంలోని రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల మధ్య బంధం మరింత దృఢంగా మారుతుందని చంద్రబాబు ఆకాంక్షించారు. నిరంతర ప్రపంచ ఆర్థిక వృద్ధికి ఈ నిర్ణయం ఎంతో దోహదపడుతుందన్నారు.మోదీ నాయకత్వంలో భారతదేశం అంతర్జాతీయ ఆర్థిక శక్తిగా తన స్థానాన్ని మరింత పటిష్ఠం చేసుకుంటోందని చంద్రబాబు పేర్కొన్నారు.
ఈ ఒప్పందం వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తూ.. ఇది భారత ఎగుమతుల పోటీ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లోని యువతకు కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులకు మార్గం సుగమమై రైతులకు విస్తృత అవకాశాలు లభిస్తాయని చంద్రబాబు స్పష్టం చేశారు. అంతర్జాతీయ వాణిజ్య రంగంలో భారత్ ముద్ర వేసేలా ఈ ఒప్పందం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. దేశీయ ఉత్పత్తులకు అమెరికా వంటి పెద్ద మార్కెట్‌లో సానుకూల వాతావరణం ఏర్పడటం దేశ పురోగతికి సంకేతమని ఆయన పేర్కొన్నారు.



