ఎర్రబెల్లి దయాకర్ రావు భావోద్వేగం

ఎర్రబెల్లి దయాకర్ రావు భావోద్వేగం

మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక తీవ్ర ఉద్రిక్తతల మధ్య ముగిసింది. మెజారిటీ స్థానాలు సాధించినప్పటికీ, మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవడంలో బీఆర్ఎస్ పార్టీ విఫలమైంది. 

విశ్వంభర, తెలంగాణ బ్యూరో: మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక తీవ్ర ఉద్రిక్తతల మధ్య ముగిసింది. మెజారిటీ స్థానాలు సాధించినప్పటికీ, మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవడంలో బీఆర్ఎస్ పార్టీ విఫలమైంది. ఈ పరాజయంతో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో మీడియాతో మాట్లాడుతున్న సందర్భంగా ఆయన బోరున విలపించారు. రేయింబవళ్లు కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కావడం లేదని ఎర్రబెల్లి దయాకర్ రావు కంటతడి పెట్టుకున్నారు.

లాటరీతో తేలిన ఫలితం
తొర్రూర్ మున్సిపాలిటీ ఎన్నికల్లో మొత్తం 16 వార్డులకు గాను బీఆర్ఎస్ 9 సీట్లు, కాంగ్రెస్ 7 సీట్లు గెలుచుకున్నాయి. అయితే, ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే యశస్విని రెడ్డిల ఎక్స్-అఫీషియో సభ్యుల ఓట్లతో కాంగ్రెస్ బలం బీఆర్ఎస్‌తో సమానమైంది. దీంతో అధికారులు లాటరీ ద్వారా చైర్మన్‌ను నిర్ణయించారు. ఈ లాటరీలో కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించడంతో కాంగ్రెస్ అధికారాన్ని చేజిక్కించుకుంది.

Read More అక్రిడిటేష‌న్‌, మీడియా కార్డుల‌కు ఎలాంటి తేడా లేదు, ఆందోళ‌న వ‌ద్దు, మీతో నేనున్నా

పోలీసులు అదుపులోకి ఎర్రబెల్లి
ఎన్నికల సమయంలో మున్సిపల్ కార్యాలయం వద్ద హైటెన్షన్ నెలకొంది. ఎంపీ కడియం కావ్య ఎక్స్-అఫీషియో ఓటుపై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఎమ్మెల్యే, ఎంపీలు తమను బెదిరించారని బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఆరోపించారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు నిరసనలకు దిగగా, ఉద్రిక్త పరిస్థితుల కారణంగా పోలీసులు ఎర్రబెల్లి దయాకర్ రావును అదుపులోకి తీసుకుని నర్సింహులపేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించడానికి పట్టణంలో 144 సెక్షన్ విధించారు.

రాజకీయ భవిష్యత్తుపై ఎర్రబెల్లి ప్రశ్న
మీడియాతో మాట్లాడుతూ దయాకర్ రావు తీవ్రంగా స్పందించారు. "రేయింబవళ్లు కష్టపడి పనిచేసిన గులాబీ కార్యకర్తలకు తాను ఏం సమాధానం చెప్పాలి?" అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్యమా లేక నిరంకుశత్వమా అని ప్రశ్నిస్తూ, ఇటువంటి రాజ్యాంగ విరుద్ధమైన చర్యల తర్వాత రాజకీయాలలో ఉండాలా వద్దా అని ఎర్రబెల్లి తన ఆవేదనను వెళ్లగక్కారు.