రూ.26వేలకే కారు అంటూ ప్రకటన.. వ్యాపారి అరెస్ట్

రూ.26వేలకే కారు అంటూ ప్రకటన.. వ్యాపారి అరెస్ట్

 గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారీ డిస్కౌంట్ ఇస్తానంటూ ప్రజలను తప్పుదోవ పట్టించిన పాత కార్ల వ్యాపారి రోషన్‌పై నాచారం పోలీసులు కేసు నమోదు చేశారు.

విశ్వంభర, క్రైం బ్యూరో:  గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారీ డిస్కౌంట్ ఇస్తానంటూ ప్రజలను తప్పుదోవ పట్టించిన పాత కార్ల వ్యాపారి రోషన్‌పై నాచారం పోలీసులు కేసు నమోదు చేశారు. కేవలం వ్యాపార ప్రచారం కోసం తప్పుడు వాగ్దానాలు చేసి శాంతిభద్రతల సమస్యకు కారణమైనందుకు ఈ చర్య తీసుకున్నారు. మల్లాపూర్‌కు చెందిన రోషన్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో "రిపబ్లిక్ డే స్పెషల్: కేవలం రూ. 26,000కే కారు" అని ప్రకటించాడు. అంతటితో ఆగకుండా అటువంటి 50 కార్లు సిద్ధంగా ఉన్నాయని పోస్ట్ చేయడంతో, ఆశావహులు సోమవారం తెల్లవారుజాము నుండే షాపు ముందు బారులు తీరారు.

జనం భారీగా రావడంతో భయపడిన రోషన్, తన వద్ద కేవలం 10 కార్లు మాత్రమే ఉన్నాయని, మిగతావి లేవని చేతులెత్తేశాడు. దీంతో వేల సంఖ్యలో తరలివచ్చిన జనం తాము మోసపోయామని గ్రహించారు. దీంతో ఆగ్రహించిన బాధితులు షాపులోని కార్లపై రాళ్లతో దాడి చేసి తమ నిరసనను వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న నాచారం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రోషన్‌ను అదుపులోకి తీసుకున్నారు. తప్పుడు ప్రకటనలతో ప్రజలను వంచించినందుకు అతనిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సోషల్ మీడియాలో వచ్చే నమ్మశక్యం కాని ఆఫర్లను గుడ్డిగా నమ్మవద్దని, ఇలాంటి తప్పుడు ప్రకటనలు ఇచ్చే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

Read More జాగృతి జనం బాటలో భాగంగా కృష్ణవేణి   టాలెంట్ స్కూల్  సందర్శన