తెలంగాణ జలహక్కులపై కాంగ్రెస్ 'మరణశాసనం'!
రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలు ముఖ్యం కాదని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తీరు వల్ల రాష్ట్రానికి తీరని "జలద్రోహం" జరుగుతోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు.
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలు ముఖ్యం కాదని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తీరు వల్ల రాష్ట్రానికి తీరని "జలద్రోహం" జరుగుతోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. "ఈ ప్రాంతం వాడే తెలంగాణకు ద్రోహం చేస్తాడని కాళోజీ గారు ఆనాడే చెప్పారు. నేడు రేవంత్ రెడ్డి రూపంలో అది నిజమవుతోంది" అని హరీష్ రావు వ్యాఖ్యానించారు. ఏపీ ప్రయోజనాల కోసం, చంద్రబాబు నాయుడుపై ఉన్న మమకారంతో రేవంత్ రెడ్డి తెలంగాణ నీటిని ధారపోస్తున్నారని, నల్లమల సాగర్ ప్రాజెక్టుకు సహకరించడమే దీనికి నిదర్శనమని విమర్శించారు. సుప్రీంకోర్టులో బలహీనమైన రిట్ పిటిషన్ వేసి వెనక్కి తీసుకోవడం ద్వారా తెలంగాణ నీటి చరిత్రలో నేడు ఒక 'చీకటి రోజు' గా మిగిలిపోతుందని తెలిపారు.
నల్లమల సాగర్ కుట్ర
నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టు ద్వారా తెలంగాణకు రావాల్సిన 200 టీఎంసీల నీటిని ఏపీ తరలించుకుపోతుంటే ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని ఆయన ప్రశ్నించారు. డీపీఆర్ ఆపాలని, కేంద్రం అనుమతులు రద్దు చేయాలని గతంలో లేఖ రాసిన ప్రభుత్వం.. ఆ షరతులకు కేంద్రం/ఏపీ అంగీకరించకుండానే ఢిల్లీ మీటింగ్‌కు ఎందుకు వెళ్లింది? అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రాజెక్టులను అడుగడుగునా వ్యతిరేకించిన ఇంజనీర్ ఆదిత్యనాథ్‌ను ఈ కీలక చర్చలకు ఎందుకు పంపారు? అని నిలదీశారు. రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా జరుగుతున్న ఈ సమావేశాన్ని ప్రభుత్వం ఎందుకు బహిష్కరించలేదని హరీశ్ రావు అడిగారు.
కేంద్ర మంత్రులపై విమర్శలు
రాష్ట్రానికి ఇంత అన్యాయం జరుగుతుంటే కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి ఎందుకు నోరు విప్పడం లేదని హరీష్ రావు నిలదీశారు. రేవంత్ రెడ్డికి కేవలం ఢిల్లీ, దావోస్ పర్యటనలపై ఉన్న శ్రద్ధ రాష్ట్ర పాలనపై లేదని ఎద్దేవా చేశారు. జల ద్రోహం విషయంలో కత్తి చంద్రబాబుది అయితే.. పొడిచేది మాత్రం రేవంత్ రెడ్డి. ఈ దుర్మార్గాన్ని ప్రజల్లో ఎండగడతాం. నీటి హక్కుల కోసం మరో పోరాటానికి సిద్ధమవుతామని హరీశ్ రావు తెలిపారు.



