డైలీ సీరియల్‌లా సిట్ విచారణ

కేసీఆర్‌కు సిట్ నోటీసులపై రేవంత్ సర్కార్‌పై కవిత ధ్వజం

డైలీ సీరియల్‌లా సిట్ విచారణ

ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేయడంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఘాటుగా స్పందించారు.

విశ్వంభర, తెలంగాణ బ్యూరో: ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేయడంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఘాటుగా స్పందించారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆమె, ఈ నోటీసుల వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందే లక్ష్యంతోనే ప్రభుత్వం ఈ చర్యలకు పూనుకుందని ఆమె విమర్శించారు.
 
ఈ కేసు విచారణ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన కవిత, సిట్ విచారణ అసలు సీరియస్‌గా జరగడం లేదని మండిపడ్డారు. ఒక ముఖ్యమైన కేసును త్వరగా ముగించకుండా, ప్రభుత్వం దీనిని ఒక ‘డైలీ సీరియల్’ లాగా కావాలనే సాగదీస్తోందని ఎద్దేవా చేశారు. ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడటం అనేది ముమ్మాటికీ తప్పేనని, దానిని ఎవరూ సమర్థించబోరని స్పష్టం చేసిన ఆమె, అయితే ఈ కేసులో అసలైన నేరస్థులకు శిక్ష పడేలా ప్రభుత్వం వ్యవహరించడం లేదని ఆక్షేపించారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఈ అంశాన్ని ఇంకెన్నాళ్లు నాన్చుతారో చూస్తామని ఆమె ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.