మున్సిపల్ నగారా..  ఫిర్యాదుల కోసం ‘TE-Poll’ మొబైల్ యాప్

ఫిబ్రవరి 11న తుది పోరు..13న  ఓట్ల లెక్కింపు

మున్సిపల్ నగారా..  ఫిర్యాదుల కోసం ‘TE-Poll’ మొబైల్ యాప్

తెలంగాణ రాష్ట్రంలో పురపాలక ఎన్నికల సందడి మొదలైంది. ఎన్నికల ప్రక్రియను మరింత పారదర్శకంగా, పౌరులకు చేరువగా ఉంచేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక అడుగు వేసింది.

విశ్వంభర, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో పురపాలక ఎన్నికల సందడి మొదలైంది. ఎన్నికల ప్రక్రియను మరింత పారదర్శకంగా, పౌరులకు చేరువగా ఉంచేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక అడుగు వేసింది. ఓటర్లు తమ ఫిర్యాదులను ఎక్కడి నుంచైనా నమోదు చేసేలా సరికొత్త సాంకేతికతను అందుబాటులోకి తెచ్చింది.
 
అరచేతిలోనే ఎన్నికల పర్యవేక్షణ..
ఎన్నికల నిర్వహణలో ఎదురయ్యే ఆటంకాలు లేదా అక్రమాలపై పౌరులు తక్షణమే స్పందించేందుకు ‘TE-Poll’ పేరుతో ప్రత్యేక మొబైల్ అప్లికేషన్‌ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. క్షేత్రస్థాయిలో ఏవైనా సమస్యలు తలెత్తినా, నిబంధనల ఉల్లంఘనలు జరిగినా ఈ యాప్ ద్వారా నేరుగా అధికారుల దృష్టికి తీసుకెళ్లవచ్చు. కేవలం యాప్ మాత్రమే కాకుండా, అధికారిక వెబ్‌సైట్ tsec.gov.in ద్వారా కూడా ఫిర్యాదులు చేసే సౌలభ్యాన్ని కల్పించారు.
 
ఫిబ్రవరి 11న తుది పోరు..
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 7 నగరపాలక సంస్థలు , 116 పురపాలక సంఘాల భవితవ్యాన్ని తేల్చేందుకు సర్వం సిద్ధమైంది. షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 11న పోలింగ్ నిర్వహించనుండగా, అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించే ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఫిబ్రవరి 13న చేపట్టనున్నారు. ఈ స్వల్ప వ్యవధిలోనే ఎన్నికల యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తమై, సాంకేతికత సాయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది.