6వ వార్డు నుంచి అంతిరెడ్డి పోటీ
విశ్వంభర, పటాన్‌చెరు : జనవరి 30: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలంలోని ఇంద్రేశం మున్సిపాలిటీ ఎన్నికల నగారా మోగడంతో రాజకీయ సందడి మొదలైంది. నామినేషన్ల ప్రక్రియలో భాగంగా, శుక్రవారం బీఆర్‌ఎస్ పార్టీ తరపున 6వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా అంతిరెడ్డి తన నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చి ఆయనకు మద్దతు తెలిపారు.నామినేషన్ అనంతరం అంతిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి పనులే తమను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. గత పదేళ్లలో మున్సిపాలిటీ పరిధిలో జరిగిన మౌలిక సదుపాయాల కల్పనను ప్రజలు మరువలేదని పేర్కొన్నారు. కౌన్సిలర్‌గా విజయం సాధించి, అనంతరం మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకుంటామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీపై అంతిరెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ప్రజలను మభ్యపెడుతూ కాలం వెళ్లదీస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూ, బీఆర్‌ఎస్ చేసిన అభివృద్ధిని గడపగడపకూ తీసుకెళ్తామని చెప్పారు. ప్రజలు మళ్లీ బీఆర్‌ఎస్ నాయకత్వాన్నే కోరుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు మరియు వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



