దానం భవితవ్యంపై ఉత్కంఠ!

దానం భవితవ్యంపై ఉత్కంఠ!

రాష్ట్ర రాజకీయాల్లో గత కొంతకాలంగా వేడి పుట్టిస్తున్న ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల వ్యవహారం ఇప్పుడు నిర్ణయాత్మక దశకు చేరుకుంది.

విశ్వంభర, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర రాజకీయాల్లో గత కొంతకాలంగా వేడి పుట్టిస్తున్న ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల వ్యవహారం ఇప్పుడు నిర్ణయాత్మక దశకు చేరుకుంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీ ఫిరాయింపుపై దాఖలైన పిటిషన్లను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇవాళ అసెంబ్లీలోని తన ఛాంబర్‌లో విచారించారు.  బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి చేరిన దానం నాగేందర్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీజేపీ శాసనాసభా పక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లను స్పీకర్ విచారణకు స్వీకరించారు. విచారణకు పిటిషనర్ పాడి కౌశిక్ రెడ్డి తన న్యాయవాదులతో కలిసి రాగా, దానం నాగేందర్ కూడా తన న్యాయబృందంతో హాజరయ్యారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఉన్నందున విచారణను వాయిదా వేయాలని బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కోరడంతో, స్పీకర్ తదుపరి విచారణను ఫిబ్రవరి 18కి వాయిదా వేశారు.

సుప్రీంకోర్టు డెడ్ లైన్.. స్పీకర్ వేగం
పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత కేసులో సుప్రీంకోర్టు విధించిన గడువు రేపటితో ముగియనుండటంతో స్పీకర్ విచారణను వేగవంతం చేశారు. గతంలో కూడా పలువురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను స్పీకర్ తిరస్కరించిన నేపథ్యంలో, ఇప్పుడు దానం నాగేందర్ విషయంలో ఏ అడుగు వేస్తారనేది మిగిలిన 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఒక సంకేతంగా మారనుంది. ఒకవేళ దానంపై అనర్హత వేటు పడితే, అది రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించడం ఖాయం. అటు బీఆర్ఎస్ తమ నైతిక విజయం కోసం పోరాడుతుండగా, ఇటు అధికార కాంగ్రెస్ న్యాయపరమైన రక్షణ కోసం ప్రయత్నిస్తోంది. ఫిబ్రవరి 18న జరిగే విచారణలో దానం నాగేందర్ సభ్యత్వంపై తుది క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Read More ఘనంగా వినియోగదారుల చైతన్య సదస్సు