సినిమాపై 'రాజకీయ' నీడ.. సీఎం సిద్ధరామయ్యకు ప్రకాష్ రాజ్ విజ్ఞప్తి

సినిమాపై 'రాజకీయ' నీడ.. సీఎం సిద్ధరామయ్యకు ప్రకాష్ రాజ్ విజ్ఞప్తి

కళలకు, సాహిత్యానికి రాజకీయ రంగు పూయడం సరికాదని సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ అభిప్రాయపడ్డారు. 

విశ్వంభర, సినిమా బ్యూరో: కళలకు, సాహిత్యానికి రాజకీయ రంగు పూయడం సరికాదని సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ అభిప్రాయపడ్డారు. 17వ బెంగళూరు అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో బ్రాండ్ అంబాసిడర్‌గా పాల్గొన్న ఆయన, చలన చిత్ర రంగంలో పెరుగుతున్న రాజకీయ జోక్యంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. చలన చిత్రోత్సవాల ప్రధాన ఉద్దేశం విభిన్న సంస్కృతులను, భిన్నమైన ఆలోచనలను ప్రపంచానికి పరిచయం చేయడమేనని ప్రకాష్ రాజ్ గుర్తు చేశారు.

ఇటీవల కాలంలో సాహిత్య, సినిమా వేదికలపై రాజకీయ ప్రభావం పెరిగిపోయిందని, ఇది కళాకారుల స్వేచ్ఛను హరిస్తోందని ప్రకాష్ రాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ వేదికలపై పాలస్తీనా సినిమాలను నిషేధించడాన్ని ఆయన తప్పుబట్టారు. ఇది ఆమోదయోగ్యం కాదని, కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించాలని కోరారు. "పాలస్తీనా చిత్రాల ప్రదర్శన విషయంలో కేరళ ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. అక్కడ ఆ సినిమాలను ప్రదర్శించారు. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే దిశగా అడుగులు వేయాలి" అని ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు విజ్ఞప్తి చేశారు.

Read More చిరు సినిమా క్లైమాక్స్‌పై క్రేజీ అప్‌డేట్

ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందన
చిత్రోత్సవ ప్రారంభ వేడుకల్లో పాల్గొన్న కర్ణాటక సీఎం సిద్ధరామయ్య చిత్ర పరిశ్రమకు భరోసా ఇచ్చారు. సమాజ శ్రేయస్సును కోరుతూ, సామాజిక మార్పు కోసం నిర్మించే చిత్రాలకు తమ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. కర్ణాటక చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.