కాంగ్రెస్‌లో ‘సయోధ్య’ రాజకీయం..

ఖర్గే, రాహుల్‌తో శశిథరూర్‌ కీలక భేటీ 

కాంగ్రెస్‌లో ‘సయోధ్య’ రాజకీయం..

కాంగ్రెస్‌ పార్టీలో గత కొంతకాలంగా వినిపిస్తున్న అసమ్మతి స్వరాలకు బ్రేక్ పడింది. పార్టీ అగ్ర నాయకత్వంపై శశిథరూర్‌ అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారానికి తెరదించుతూ.. పార్లమెంట్‌ ప్రాంగణంలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కీలక నేత రాహుల్‌ గాంధీలతో థరూర్‌ ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
 

విశ్వంభర, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్‌ పార్టీలో గత కొంతకాలంగా వినిపిస్తున్న అసమ్మతి స్వరాలకు బ్రేక్ పడింది. పార్టీ అగ్ర నాయకత్వంపై శశిథరూర్‌ అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారానికి తెరదించుతూ.. పార్లమెంట్‌ ప్రాంగణంలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కీలక నేత రాహుల్‌ గాంధీలతో థరూర్‌ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. దాదాపు 30 నిమిషాల పాటు సాగిన ఈ భేటీలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు, పార్టీ బలోపేతంపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. తన సొంత పార్టీ నేతలను కలవడంలో ప్రాధాన్యత ఏముందని భేటీకి ముందు వ్యాఖ్యానించిన థరూర్, సమావేశం ముగిశాక మాత్రం పూర్తి సానుకూలత వ్యక్తం చేయడం గమనార్హం.
 
 
క్లారిటీ ఇచ్చిన థరూర్..
సమావేశం అనంతరం శశిథరూర్ సామాజిక మాధ్యమం వేదికగా స్పందిస్తూ భేటీకి సంబంధించిన ఫొటోను పంచుకున్నారు. "అనేక అంశాలపై ఖర్గే, రాహుల్‌లతో ఆత్మీయంగా చర్చించాం. మేమంతా ఒకే అభిప్రాయంతో ఉన్నాం. దేశ ప్రజలకు సేవ చేసేందుకు ఐక్యంగా ముందుకు సాగుతాం" అని స్పష్టం చేశారు. గతంలో విదేశీ వ్యవహారాలపై పార్టీ వైఖరికి భిన్నంగా మాట్లాడటం, కొన్ని సందర్భాల్లో ప్రధాని మోదీని ప్రశంసించడం ద్వారా థరూర్‌ సొంత పార్టీలోనే విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో తాజా భేటీ ద్వారా అధిష్ఠానంతో ఉన్న గ్యాప్‌ను ఆయన భర్తీ చేసుకున్నట్లు కనిపిస్తోంది.
 
పాత గొడవలు పక్కన పెట్టి.. ముందడుగు..
గతేడాది 'ఆపరేషన్‌ సిందూర్‌' సమయంలో దౌత్యపరమైన అంశాలపై థరూర్‌ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. అప్పటి నుంచి పార్టీకి, ఆయనకు మధ్య దూరం పెరిగిందనే చర్చ నడుస్తోంది. అయితే, పార్లమెంటరీ నిబంధనలను తాను ఎప్పుడూ ఉల్లంఘించలేదని, కేవలం అభిప్రాయభేదాలు మాత్రమే ఉండేవని థరూర్‌ తాజాగా వివరణ ఇచ్చారు. తాజా భేటీతో కాంగ్రెస్ వర్గాల్లో నెలకొన్న సందిగ్ధత తొలగిపోయిందని, కీలక నేతల మధ్య సయోధ్య కుదిరిందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Tags: Congress