ఆర్థిక సర్వే.. పరుగులు పెడుతున్న భారత ఆర్థిక రథం

వృద్ధి రేటు - ద్రవ్యలోటు అంచనాలు

ఆర్థిక సర్వే.. పరుగులు పెడుతున్న భారత ఆర్థిక రథం

బడ్జెట్‌కు ముందు ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టడం భారత్‌లో ఒక సంప్రదాయంగా వస్తోంది. గత ఏడాది కాలంలో దేశ ఆర్థిక పనితీరు ఎలా ఉంది? రాబోయే ఏడాదిలో ఎదురయ్యే సవాళ్లేంటి? అనే అంశాలను ఆర్థిక వ్యవహారాల విభాగం ఈ సర్వేలో నిక్షిప్తం చేస్తుంది.
 

విశ్వంభర, నేషనల్ బ్యూరో: బడ్జెట్‌కు ముందు ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టడం భారత్‌లో ఒక సంప్రదాయంగా వస్తోంది. గత ఏడాది కాలంలో దేశ ఆర్థిక పనితీరు ఎలా ఉంది? రాబోయే ఏడాదిలో ఎదురయ్యే సవాళ్లేంటి? అనే అంశాలను ఆర్థిక వ్యవహారాల విభాగం ఈ సర్వేలో నిక్షిప్తం చేస్తుంది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఉభయ సభల్లో ఆర్థిక సర్వే 2025-26ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్  ప్రవేశపెట్టారు. ఈ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు 7.4 శాతంగా నమోదు కావొచ్చని ఆర్థిక సర్వే అంచనా వేసింది. ఇక రాబోయే 2026-27 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి 6.8 నుంచి 7.2 శాతం మధ్య ఉండొచ్చని సర్వే విశ్లేషించింది. ద్రవ్యలోటును గతేడాది ఉన్న 4.8 శాతం నుంచి 4.4 శాతానికి తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టింది.

మొబైల్ @ 5.45 లక్షల కోట్లు
కేంద్ర ఆర్థిక సర్వే గణాంకాల ప్రకారం... 'వికసిత్ భారత్' లక్ష్య సాధనలో వ్యవసాయ రంగం కీలక పాత్ర పోషిస్తోంది. అటు తయారీ రంగంలోనూ భారత్ గ్లోబల్ హబ్‌గా మారుతోంది. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ రంగం అద్భుత ప్రగతిని సాధించింది. పదేళ్ల క్రితం కేవలం 18 వేల కోట్లుగా ఉన్న మొబైల్ ఫోన్ల ఉత్పత్తి విలువ, నేడు 5 లక్షల 45 వేల కోట్లకు చేరింది. పీఎల్ఐ పథకాల ద్వారా లక్షల కోట్ల పెట్టుబడులు రావడమే కాకుండా.. సుమారు 12 లక్షల మందికి కొత్తగా ఉపాధి లభించింది. సెమీకండక్టర్ మిషన్ కింద 10 భారీ ప్రాజెక్టులు పట్టాలెక్కడం పారిశ్రామిక విప్లవానికి సంకేతంగా నిలుస్తోంది.

Read More 8, 9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌..సీఎం రేవంత్ భారీ సన్నాహాలు !

విదేశీ మారక నిల్వలు - రక్షణ కవచం
అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు, యుద్ధ వాతావరణం ఉన్నప్పటికీ భారత్ తన విదేశీ రక్షణ కవచాన్ని పటిష్టం చేసుకుంది. 701 బిలియన్ డాలర్ల రికార్డు స్థాయి విదేశీ మారక నిల్వలు దేశానికి భరోసాగా ఉన్నాయి. ఇది దాదాపు 11 నెలల దిగుమతులకు సరిపోతుంది. సేవలు, వస్తువుల ఎగుమతులు 825 బిలియన్ డాలర్లకు చేరాయి. సామాన్యుడిని వేధించే ద్రవ్యోల్బణం 1.7 శాతానికి పరిమితం కావడం ప్రభుత్వ పారదర్శక పాలనకు నిదర్శనం. జీఎస్టీ వసూళ్లు 17 లక్షల కోట్ల మార్కును దాటడం ఆర్థిక పటిష్టతకు అద్దం పడుతోంది. డిజిటల్ సేవల వినియోగంలో పట్టణాలకు ధీటుగా గ్రామాలు పోటీ పడుతున్నాయి. భారత్-ఈయూ మధ్య కుదిరిన ట్రేడ్ డీల్ కొత్త ఎగుమతి అవకాశాలను కల్పిస్తోంది. ఇక మౌలిక సదుపాయాల విషయానికి వస్తే.. జాతీయ రహదారుల నిడివి 60 శాతం పెరిగి లక్షా 46 వేల కిలోమీటర్లకు చేరింది. రైల్వే నెట్‌వర్క్ దాదాపు వంద శాతం విద్యుదీకరణ దిశగా సాగుతోంది. అంతరిక్ష రంగం, ఏఐ టెక్నాలజీలో సామాన్యుడి భాగస్వామ్యం పెరగడం భవిష్యత్ భారత్‌కు శుభసూచకమని విశ్లేషకులు అంటున్నారు.

తెలంగాణ ప్రగతి ప్రస్థానం
ఇక తెలంగాణ ఆర్థిక ప్రగతిపై ఆర్థిక సర్వే 2025-26 కీలక గణాంకాలను వెల్లడించింది. 2014-23 మధ్య కాలంలో రాష్ట్రంలో సాగు యోగ్య భూమి విస్తీర్ణం 1.31 కోట్ల ఎకరాల నుంచి 2.21 కోట్ల ఎకరాలకు గణనీయంగా పెరగగా, దేశ తయారీ రంగంలో రాష్ట్రం 5 శాతం వాటాను నమోదు చేసింది. ఐటీ, ఫైనాన్స్, ప్రొఫెషనల్ సర్వీసుల్లో కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడులతో కలిసి తెలంగాణ 40 శాతం వాటాను పంచుకోగా, ఏఐ స్టార్టప్‌లలో రాష్ట్రం 7 శాతం వాటాతో రాణిస్తోంది. పరిపాలనా సంస్కరణల్లో భాగంగా 'భూభారతి' ద్వారా రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల విభాగాలను ఏకీకృతం చేసిన తీరును సర్వే ప్రశంసించగా, మున్సిపల్ బాండ్ల జారీలో భాగ్యనగరం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ నాలుగో స్థానంలో, విజయవాడ పదో స్థానంలో నిలవడమే కాకుండా.. 2035 నాటికి హైదరాబాద్ జీడీపీ 201.4 బిలియన్ డాలర్లకు, విజయవాడ జీడీపీ 21.3 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని సర్వే అంచనా వేసింది. 

మొత్తానికి.. 2025-26 ఆర్థిక సర్వే కేవలం అంకెలు కాదు..  140 కోట్ల భారతీయుల ఆకాంక్షలకు ప్రతిరూపం. 'మారథాన్‌ను స్ప్రింట్‌లా' పరిగెడుతూ, దీర్ఘకాలిక లక్ష్యాలను వేగంగా చేరుకోవాలని ఈ సర్వే దిశానిర్దేశం చేసింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు తడబడుతున్న వేళ.. స్థిరమైన వృద్ధి, పటిష్టమైన సంస్కరణలతో గ్లోబల్ లీడర్‌గా ఎదిగేందుకు భారత్ సర్వసిద్ధమైంది. ఫిబ్రవరి 1న సమర్పించబోయే కేంద్ర బడ్జెట్‌లో ఈ సర్వే అంశాలు ఎలాంటి ప్రాధాన్యత సంతరించుకుంటాయో చూడాలి.

Related Posts