"ఇది ముమ్మాటికీ రాజకీయ కక్ష సాధింపే!" 

కేసీఆర్‌కు సిట్ నోటీసులపై కేటీఆర్ ఫైర్ 

గత ప్రభుత్వ నిర్ణయాలపై విచారణ పేరుతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నోటీసులు పంపడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా తప్పుబట్టారు.

విశ్వంభర, తెలంగాణ బ్యూరో: గత ప్రభుత్వ నిర్ణయాలపై విచారణ పేరుతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నోటీసులు పంపడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా తప్పుబట్టారు. ఇది కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్య అని, ప్రస్తుత ప్రభుత్వం తన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే ఇదంతా చేస్తోందని ఆయన విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో ఉన్న విద్యుత్ సంక్షోభాన్ని అధిగమించడానికి కేసీఆర్ ప్రభుత్వం ఎంతో ముందుచూపుతో నిర్ణయాలు తీసుకుందని కేటీఆర్ గుర్తు చేశారు. చత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు కానీ, యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్లాంట్ల నిర్మాణం కానీ అప్పట్లో ఉన్న అత్యవసర పరిస్థితుల దృష్ట్యా, నిబంధనలకు లోబడే జరిగాయని ఆయన స్పష్టం చేశారు. ఏ విచారణకైనా తాము సిద్ధమని, అయితే ఆ విచారణ పారదర్శకంగా ఉండాలని ఆయన డిమాండ్ చేశారు.
 
నోటీసులకు తాము భయపడే ప్రసక్తే లేదు..
ప్రజా కోర్టులో ఓడిపోయినప్పటికీ, తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ స్థానం సుస్థిరమని, ఇలాంటి నోటీసులకు తాము భయపడే ప్రసక్తే లేదని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయలేక, ఇలాంటి పాత అంశాలను మళ్ళీ తెరపైకి తెచ్చి కాలయాపన చేస్తోందని ఆయన మండిపడ్డారు. చట్టపరంగానే ఈ నోటీసులను ఎదుర్కొంటామని, నిజనిజాలు త్వరలోనే ప్రజల ముందుకు వస్తాయని కేటీఆర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Tags: BRS Ktr