మామునూరు విమానాశ్రయ నిర్మాణానికి కీలక ముందడుగు

  • 300 ఎకరాల భూమి కేంద్ర మంత్రికి అందజేత

విశ్వంభర,  హనుమకొండ: వరంగల్ జిల్లాలోని మామునూరు విమానాశ్రయ అభివృద్ధి దిశగా కీలక ముందడుగు పడింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూసేకరణ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసి, సేకరించిన 300 ఎకరాల భూమిని నేడు బేగంపేట్ విమానాశ్రయంలో అధికారికంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి  కింజారపు రామ్మోహన్ నాయుడు కి అప్పగించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు  వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు పుష్పగుచ్చం అందజేసి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు  మాట్లాడుతూ, మామునూరు విమానాశ్రయ అభివృద్ధి వరంగల్ ప్రాంత ప్రజల చిరకాల కల అని తెలిపారు. ఎన్నో ఏండ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ ప్రాజెక్టును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ సంకల్పంతో ముందుకు తీసుకువెళ్లి, భూసేకరణను వేగవంతంగా పూర్తి చేయడం అభినందనీయమన్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఈ విమానాశ్రయాన్ని కేంద్ర ప్రభుత్వం త్వరితగతిన పూర్తి చేయాలని కేంద్ర మంత్రి ని ఆయన  కోరారు. మామునూరు విమానాశ్రయం పూర్తయితే వరంగల్ ప్రాంతానికి పారిశ్రామిక, వాణిజ్య, విద్యా రంగాల్లో వేగవంతమైన అభివృద్ధి జరుగుతుందని, యువతకు ఉపాధి అవకాశాలు విస్తృతంగా పెరుగుతాయని ఎమ్మెల్యే నాగరాజు  పేర్కొన్నారు. ఈ ఎయిర్‌పోర్ట్‌తో వరంగల్ జిల్లా రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా మరింత ప్రాధాన్యం సంతరించుకుంటుందని అన్నారు. అలాగే భూసేకరణ ప్రక్రియలో ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం అందించిన నక్కలపల్లి, గాడిపల్లి, గుంటూరుపల్లె గ్రామాల రైతులకు ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు  ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. రైతుల సహకారంతోనే ఎన్నో ఏండ్ల కల సాకారమైందని, వారి త్యాగం, సహనానికి వరంగల్ ప్రజలు ఎప్పటికీ రుణపడి ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమం వరంగల్ ప్రాంత అభివృద్ధి ప్రయాణంలో ఒక చారిత్రాత్మక ఘట్టమని పేర్కొంటూ, మామునూరు విమానాశ్రయం త్వరలోనే కార్యరూపం దాల్చేలా ప్రజాప్రతినిధులు, అధికారులు సమిష్టిగా కృషి చేయాలని ఎమ్మెల్యే నాగరాజు  పిలుపునిచ్చారు.

Tags: