మేడారంలో మహా ఘట్టం ఆవిష్కృతం
భారీ భద్రత నడుమ గద్దెపైకి సమ్మక్క తల్లి ఆగమనం
On
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన కుంభమేళాగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతరలో అత్యంత కీలకమైన, ఉత్కంఠభరితమైన ఘట్టం ప్రారంభమైంది.
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన కుంభమేళాగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతరలో అత్యంత కీలకమైన, ఉత్కంఠభరితమైన ఘట్టం ప్రారంభమైంది. కోట్లాది మంది భక్తులు రెండేళ్లుగా వేయి కళ్లతో ఎదురుచూస్తున్న సమ్మక్క తల్లి ఆగమన ప్రక్రియ గురువారం సాయంత్రం అత్యంత వైభవంగా మొదలైంది. చిలుకలగుట్ట నుంచి తల్లిని తీసుకువచ్చే క్రమంలో అడవి ప్రాంతమంతా భక్తి పారవశ్యంతో పులకించిపోయింది.
తల్లి రాకను పురస్కరించుకుని అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. సంప్రదాయం ప్రకారం జిల్లా ఎస్పీ గాల్లోకి కాల్పులు జరిపి సమ్మక్క తల్లికి అధికారికంగా స్వాగతం పలికారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రభుత్వం మూడంచెల భద్రతా వలయాన్ని ఏర్పాటు చేసింది. సరిగ్గా రాత్రి 8:30 గంటల సమయానికి తల్లి గద్దెపైకి చేరుకోనుండటంతో, ఆ అపురూప దృశ్యాన్ని కళ్లారా వీక్షించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.
అమ్మవారికి భక్తుల ఘన స్వాగతం
జంపన్న వాగు మీదుగా తల్లి మేడారం గ్రామానికి చేరుకుంటున్న తరుణంలో భక్తులు పూనకాలతో తన్మయత్వానికి లోనయ్యారు. దారి పొడవునా పసుపు, కుంకుమలు చల్లుతూ, కొబ్బరికాయలు కొడుతూ అమ్మవారికి ఘన స్వాగతం పలికారు. గద్దెల ప్రాంతానికి చేరుకున్న తదుపరి ప్రధాన పూజారి సారయ్య ఆధ్వర్యంలో అమ్మవారికి శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ చారిత్రాత్మక ఘట్టంలో రాష్ట్ర మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర్‌లు పాల్గొని అమ్మవారికి మొక్కులు సమర్పించారు. ఇప్పటికే సారలమ్మ గద్దెపైకి చేరుకోవడంతో జాతర తొలి ఘట్టం విజయవంతం కాగా, ఇప్పుడు సమ్మక్క తల్లి కూడా తోడవడంతో మేడారం జనసంద్రంగా మారింది. భక్తుల జయజయధ్వానాలు, శివసత్తుల పూనకాలతో అడవి తల్లి పులకించిపోతోంది.
జనసంద్రంగా మేడారం..
మేడారం మహా జాతర ప్రస్తుతం జనసంద్రంగా మారింది. సమ్మక్క తల్లి గద్దెపైకి చేరుకునే అత్యంత కీలకమైన ఘట్టం కావడంతో భక్తుల రద్దీ కనీవినీ ఎరుగని రీతిలో పెరిగిపోయింది. తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు లక్షలాదిగా తరలివస్తుండటంతో మేడారం పరిసరాలన్నీ కిక్కిరిసిపోయాయి. జంపన్న వాగు వద్ద పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు పోటెత్తారు. వాగు తీరమంతా జనారణ్యంగా మారి భక్తుల కోలాహలం కనిపిస్తోంది.
గంటల తరబడి క్యూలోనే భక్తులు..
అమ్మవార్ల దర్శనం కోసం ఏర్పాటు చేసిన క్యూలైన్లు కిలోమీటర్ల మేర సాగిపోతున్నాయి. గంటల తరబడి వేచి ఉన్నా భక్తులు ఏమాత్రం అలసట చెందకుండా అమ్మవార్ల నామస్మరణతో ముందుకు సాగుతున్నారు. రద్దీ తీవ్రత దృష్ట్యా దర్శనానికి సుమారు పది గంటల కంటే ఎక్కువ సమయం పడుతోంది. అటు రహదారుల పరిస్థితి కూడా వాహనాలతో నిండిపోయింది. పస్రా నుంచి మేడారం వరకు ఉన్న మార్గాల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నప్పటికీ, ఆ తల్లిని దర్శించుకోవాలనే పట్టుదలతో మేడారం బాట పడుతున్నారు. అధికారులు ఎప్పటికప్పుడు రద్దీని పర్యవేక్షిస్తూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపడుతున్నారు.



