400 మీటర్ల దూరానికి రూ. 18 వేలు వసూలు!

 400 మీటర్ల దూరానికి రూ. 18 వేలు వసూలు!

అథితి దేవోభవ అనే మాటకు విరుద్ధంగా ప్రవర్తించిన ఓ ట్యాక్సీ డ్రైవర్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. కేవలం 400 మీటర్ల ప్రయాణానికి ఒక విదేశీ పర్యాటకురాలి వద్ద నుంచి ఏకంగా రూ. 18,000 వసూలు చేసిన ఘరానా మోసం బయటపడింది. 

విశ్వంభర, నేషనల్ బ్యూరో: అథితి దేవోభవ అనే మాటకు విరుద్ధంగా ప్రవర్తించిన ఓ ట్యాక్సీ డ్రైవర్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. కేవలం 400 మీటర్ల ప్రయాణానికి ఒక విదేశీ పర్యాటకురాలి వద్ద నుంచి ఏకంగా రూ. 18,000 వసూలు చేసిన ఘరానా మోసం బయటపడింది. అయితే, సోషల్ మీడియా పుణ్యమా అని ముంబయి పోలీసులు కేవలం మూడు గంటల్లోనే నిందితుడిని జైలులోకి పంపించారు. 

అసలేం జరిగింది?
అర్జెంటీనా అరియానో అనే పేరుతో ఉన్న 'ఎక్స్' ఖాతాలో బాధితురాలు తనకు ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకున్నారు. ముంబై ఎయిర్‌పోర్టులో దిగిన ఆమె.. స్టార్ హోటల్‌కు వెళ్లేందుకు ట్యాక్సీ ఎక్కారు. డ్రైవర్, మరో వ్యక్తి కలిసి ఆమెను మొదట దారి మళ్లించి తెలియని ప్రదేశానికి తీసుకెళ్లారు. భయబ్రాంతులకు గురిచేసి ఆమె నుంచి రూ.18,000 వసూలు చేశారు. ఆ తర్వాత కేవలం 400 మీటర్ల దూరంలో ఉన్న హోటల్ వద్ద ఆమెను దించి వెళ్లిపోయారు. బాధితురాలు ఆ ట్యాక్సీ వివరాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో పోలీసులు తక్షణమే స్పందించారు.

Read More బీజేపీ నూతన సారథిగా నితిన్ నబీన్ 

3 గంటల్లోనే అరెస్ట్
ఈ పోస్టును సుమోటోగా స్వీకరించిన ముంబయి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి గాలింపు చేపట్టారు. ట్యాక్సీ నంబర్ ఆధారంగా నిందితుడు దేశరాజ్ యాదవ్‌ను కేవలం మూడు గంటల్లోనే అదుపులోకి తీసుకున్నారు. విచారణలో దేశరాజ్ తన నేరాన్ని అంగీకరించాడు. ఆ మహిళను అంధేరీ ఈస్ట్ ప్రాంతంలో దాదాపు 20 నిమిషాల పాటు అడ్డదిడ్డంగా తిప్పి, చివరకు ఆమె వెళ్లాల్సిన హోటల్ పక్కనే దింపినట్లు ఒప్పుకున్నాడు.  దీంతో అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ముంబై పోలీసులు తెలిపారు.