మేడిగడ్డపై కేంద్రం హెచ్చరిక
ప్రమాదకర స్థాయికి చేరిన బ్యారేజీ పరిస్థితి
On
కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన మేడిగడ్డ బ్యారేజీ భద్రత ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు సంబంధించి 'రెడ్ అలర్ట్' జారీ చేయడమే కాకుండా, దీనిని కేటగిరీ-1 కింద అత్యంత ప్రమాదకరమైన డ్యామ్‌గా గుర్తించింది.
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన మేడిగడ్డ బ్యారేజీ భద్రత ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు సంబంధించి 'రెడ్ అలర్ట్' జారీ చేయడమే కాకుండా, దీనిని కేటగిరీ-1 కింద అత్యంత ప్రమాదకరమైన డ్యామ్‌గా గుర్తించింది. 2025 రుతుపవనాల అనంతరం నిర్వహించిన తనిఖీల్లో నిర్మాణంలో ఉన్న తీవ్రమైన లోపాలను కేంద్ర నిపుణుల బృందం గుర్తించింది. ఈ లోపాలను తక్షణమే సరిదిద్దకపోతే పెను ప్రమాదం సంభవించే అవకాశం ఉందని కేంద్రం స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది.
మరోవైపు, బ్యారేజీ కుంగిపోవడానికి, ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం వాటిళ్లడానికి నిర్మాణ సంస్థే ప్రధాన కారణమని పీసీ ఘోష్ కమిషన్ తన నివేదికలో తేల్చి చెప్పింది. ముఖ్యంగా పునాదుల నిర్మాణంలో సీకెంట్ పైల్స్ వేసేటప్పుడు నిబంధనలు పాటించకపోవడం, పనులు ముగిసిన తర్వాత నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్న కాఫర్ డ్యాంను తొలగించకపోవడం వల్ల నిర్మాణ పటిష్టత దెబ్బతిన్నట్లు విచారణలో వెల్లడైంది. 20వ పిల్లర్ కుంగిన సమయంలో కొన్ని ఆధారాలను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు ప్రయత్నాలు జరిగాయని విజిలెన్స్ విభాగం ఆరోపించడం గమనార్హం. గతంలో బ్యారేజీ నిర్మాణం పూర్తి కాకముందే పూర్తయినట్లు సర్టిఫికేట్ కోరడం వంటి అంశాలు కూడా ఈ వ్యవహారంలో ఉన్న లోతైన వైఫల్యాలను ఎత్తి చూపుతున్నాయి.
2023 అక్టోబరులో మేడిగడ్డలోని ఏడో బ్లాక్ కుంగిపోయినప్పటి నుంచి పునరుద్ధరణ పనులు ఒక కొలిక్కి రావడం లేదు. కేవలం మేడిగడ్డ మాత్రమే కాకుండా, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో కూడా నీటి ఊటలు బయటపడటంతో పరిస్థితి మరింత జఠిలమైంది. జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణులు ఈ బ్యారేజీల్లో నీటి నిల్వ చేయడం శ్రేయస్కరం కాదని హెచ్చరించడంతో సాగునీటి సరఫరాపై నీలినీడలు కమ్ముకున్నాయి. బ్యారేజీలోని 85 పియర్లలో ఏ ఒక్కదానికి సమస్య వచ్చినా ఆ బ్లాకు మొత్తాన్ని తొలగించాల్సి ఉంటుందని నిపుణులు చెబుతుండటంతో, ఈ ప్రాజెక్టు భవిష్యత్తు ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒక సవాలుగా మారింది.
Tags: Medigadda



