సింగరేణి కాంట్రాక్టులపై విచారణకు సిద్ధం

సింగరేణి కాంట్రాక్టులపై విచారణకు సిద్ధం

తెలంగాణ నిధుల విషయంలో కేంద్రం చేస్తున్న అన్యాయంపై కలిసి పోరాడుదాం రమ్మంటే ప్రతిపక్ష నేతలు ముఖం చాటేస్తున్నారని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు.

విశ్వంభర, తెలంగాణ బ్యూరో: తెలంగాణ నిధుల విషయంలో కేంద్రం చేస్తున్న అన్యాయంపై కలిసి పోరాడుదాం రమ్మంటే ప్రతిపక్ష నేతలు ముఖం చాటేస్తున్నారని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. బీఆర్ఎస్ నేతలు సింగరేణి సంస్థపై పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని, ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. ప్రతిపక్షాల తీరుపై నిప్పులు చెరిగారు.

సింగరేణిలో జరుగుతున్న కేటాయింపులపై ఎలాంటి విచారణకైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి ప్రకటించారు. 2014 నుంచి సింగరేణిలో ఇచ్చిన కాంట్రాక్టులన్నీ బయటకు తీయాలని డిమాండ్ చేశారు. ఆ కాలంలో ఇచ్చిన ఒక్క కాంట్రాక్ట్ మినహా, మిగతావన్నీ నిబంధనలకు విరుద్ధంగా 'ఎక్స్‌ట్రా'గా ఇచ్చినవేనని నిరూపించేందుకు తాను సిద్ధమని పొన్నం సవాల్ విసిరారు. "హరీష్ రావు సిద్ధమా?" అంటూ నేరుగా సవాల్ విసిరారు. బీఆర్ఎస్, బీజేపీలు లోపాయికారీ ఒప్పందం చేసుకున్నాయని పొన్నం ప్రభాకర్ ఆరోపించారు.

Read More చిర్ర సాత్విక్‌ను అభినందించిన ఆల్ఫోర్స్ చైర్మన్ డాక్టర్ వి. నరేందర్ రెడ్డి.

కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ చేయించాలని తొలుత బీఆర్ఎస్ నేతలే డిమాండ్ చేశారని, తీరా ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తుంటే భయం మొదలైందని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. కాళేశ్వరం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే కిషన్ రెడ్డి, హరీష్ రావు కలిసి ఇప్పుడు సింగరేణి అంశాన్ని తెరపైకి తెచ్చారని విమర్శించారు. ఒకరినొకరు కాపాడుకోవడమే వీరిద్దరి ప్రధాన అజెండా అని ఎద్దేవా చేశారు. ''సింగరేణి ఆరోపణలపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరుతాం. వాస్తవాలు ప్రజల ముందు ఉంచుతాం. విచారణకు మేం సిద్ధం.. పారిపోయేది మీరే..'' అంటూ పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు.

కేంద్రం వద్ద తెలంగాణ హక్కులు ఏవి?
రాష్ట్రానికి రావాల్సిన నిధుల కేటాయింపులో కేంద్రం అన్యాయం చేస్తోందని, దీనిపై కేంద్రాన్ని అడిగే ధైర్యం బీఆర్ఎస్ నేతలకు లేదని మంత్రి విమర్శించారు. ఢిల్లీకి వెళ్లి కొట్లాడుదాం రమ్మంటే రాకుండా, ఇక్కడ కూర్చుని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.