విశాఖ జూలో డిప్యూటీ సీఎం పవన్ సందడి

జిరాఫీలను దత్తత తీసుకున్న జనసేనాని 

విశాఖ జూలో డిప్యూటీ సీఎం పవన్ సందడి

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ విశాఖపట్నంలోని ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాలను సందర్శించి తన ఉదారతను చాటుకున్నారు.

విశ్వంభర, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ విశాఖపట్నంలోని ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాలను సందర్శించి తన ఉదారతను చాటుకున్నారు. తన తల్లి అంజనా దేవి జన్మదినాన్ని పురస్కరించుకుని జూపార్క్‌లోని రెండు జిరాఫీలను ఏడాది కాలం పాటు దత్తత తీసుకుంటున్నట్లు ఆయన ఈ సందర్భంగా ప్రకటించారు. ఆ రెండు జిరాఫీల పోషణకు, సంరక్షణకు అయ్యే పూర్తి ఖర్చును తానే స్వయంగా భరిస్తానని వెల్లడించారు. కేవలం ప్రభుత్వమే కాకుండా, కార్పొరేట్ సంస్థలు కూడా సామాజిక బాధ్యతగా ముందుకు వచ్చి జంతువుల సంరక్షణలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.
 
ఎలుగుబంట్ల ఎన్‌క్లోజర్‌ను ప్రారంభించిన పవన్..
ఈ పర్యటనలో భాగంగా జూ పార్కులో నూతనంగా ఏర్పాటు చేసిన ఎలుగుబంట్ల ఎన్‌క్లోజర్‌ను పవన్ కల్యాణ్ ప్రారంభించారు. అనంతరం జూలోని వివిధ ప్రాంతాలను కలియతిరుగుతూ నీటి ఏనుగులు, నల్ల ఎలుగుబంట్లు, పులులు, సింహాల ఎన్‌క్లోజర్లను సందర్శించి, వాటికి స్వయంగా ఆహారాన్ని అందించారు. జంతువుల పట్ల ఉన్న ఆసక్తితో వాటి పేర్లను, అలవాట్లను జూ క్యురేటర్‌ను అడిగి తెలుసుకున్న ఆయన, ఏనుగులు,జిరాఫీల శాలలను కూడా క్షుణ్ణంగా పరిశీలించారు.
 
జూ పర్యటన ముగించుకున్న అనంతరం కంబాలకొండ ఎకో పార్కుకు చేరుకున్న ఉప ముఖ్యమంత్రి, అక్కడ నగరవనాన్ని ప్రారంభించారు. ఎకో పార్కులోని సహజసిద్ధమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తూ అక్కడి చెక్క వంతెనపై నడక సాగించారు. వనంలోని మొక్కల వివరాలు, వాటి పెరుగుదల గురించి అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు. పర్యావరణ పరిరక్షణ, వన్యప్రాణుల సంక్షేమం పట్ల ఆయన చూపిన ఈ చొరవ స్థానికులను, ప్రకృతి ప్రేమికులను విశేషంగా ఆకట్టుకుంది.