ఎన్నికల విధులను నిష్పక్షపాతంగా నిర్వహించాలి 

ఎన్నికల విధులను నిష్పక్షపాతంగా నిర్వహించాలి 

  • అడిషనల్ కలెక్టర్ పాండు

విశ్వంభర,  సంగారెడ్డి:  ఎంతో బాధ్యతతో కూడుకుని ఉండే ఎన్నికల విధులను పూర్తి పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని అడిషనల్ కలెక్టర్ పాండు సూచించారు.  మున్సిపల్ ఎన్నికలను పురస్కరించుకుని స్టాస్టిక్ సర్వైలెన్స్, ఫ్లయింగ్ స్క్వాడ్  నిఘా బృందాల అధికారులకు, జోనల్ అధికారులకు బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో శిక్షణ తరగతులు నిర్వహించారు.  శిక్షణ కార్యక్రమంలో అభ్యర్థుల ప్రచార సరళి పరిశీలన, ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే చర్యలను నిరోధించడం, ఫిర్యాదులపై తక్షణమే స్పందించడం, నిరంతర తనిఖీల నిర్వహణ తదితర అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఎస్ ఎస్ టి, ఎఫ్ ఎస్ టి,జోనల్ అధికారుల విధులు, బాధ్యతలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మాస్టర్ ట్రైనర్ కృష్ణ కుమార్ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ,   నిఘా బృందాలు సమర్ధవంతంగా, నిబద్దతతో విధులు నిర్వహించాలని హితవు పలికారు. ఎన్నికల సంఘం నిబంధనలను తు.చ తప్పకుండా పాటించాలని,  సూచించారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే విధంగా నగదు, మద్యం, ఇతర వస్తువుల పంపిణీపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని, ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనలపై ఫిర్యాదులు వచ్చిన వెంటనే స్పందించి క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా వాస్తవాలను నిర్ధారించి తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. తనిఖీల సమయంలో సాధారణ ప్రజలకు అనవసర ఇబ్బందులు ఏర్పడకుండా సంయమనంతో వ్యవహరించాలని, ఎన్నికల వ్యయం, ప్రచార సరళి, ప్రలోభాల విషయంలో నిఘా బృందాలు క్రియాశీలక పాత్ర పోషించాలని సూచించారు. ఈ సమావేశంలో ట్రైనింగ్స్ నోడల్ అధికారి రామాచారి, ఎం సి సి నోడల్ అధికారి జగదీష్, జోనల్ అధికారులు, ఎస్ ఎస్ టి, ఎఫ్ ఎస్ టి. అధికారులు పాల్గొన్నారు.

Tags: