బీఆర్ఎస్, కాంగ్రెస్ డ్రామాలు ఆడుతున్నాయి : ఎంపీ లక్ష్మణ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో అసలైన సూత్రధారులను ఎందుకు పట్టుకోలేదు?
On
రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై బీజేపీ జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు, ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ విరుచుకుపడ్డారు.
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై బీజేపీ జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు, ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ విరుచుకుపడ్డారు. ఈ వ్యవహారంలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు కలిసి ప్రజల కళ్లకు గంతలు కడుతున్నాయని, ఇరు పార్టీలు పరస్పర అవగాహనతో పొలిటికల్ డ్రామాలు ఆడుతున్నాయని ఆయన ధ్వజమెత్తారు. ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించిన ఈ తీవ్రమైన అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు.
సిట్ నోటీసులు కేవలం కాలయాపనే!
మాజీ సీఎం కేసీఆర్‌కు సిట్ నోటీసులు జారీ చేయడంపై లక్ష్మణ్ తీవ్రంగా స్పందించారు. ఈ నోటీసుల పర్వం అంతా ఒక ముందస్తు ప్రణాళిక ప్రకారం జరుగుతున్న నాటకమని ఆయన కొట్టిపారేశారు. విచారణ పేరుతో కాలయాపన చేస్తూ, ప్రధాన నిందితులను కాపాడే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. నోటీసులు ఇవ్వడం ద్వారా ప్రజల్లో తాము ఏదో చేస్తున్నామని నమ్మించే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తోందని, కానీ క్షేత్రస్థాయిలో అడుగు ముందుకు పడటం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.
ఎండ్ లేని 'డైలీ సీరియల్'.. అసలు సూత్రధారులు ఎక్కడ?**
కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ట్యాపింగ్ ఇష్యూను ఒక అంతులేని 'డైలీ సీరియల్'లా మార్చేసిందని లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. రోజుకో కొత్త లీక్ ఇవ్వడం, సోషల్ మీడియాలో హడావిడి చేయడం తప్ప, గడిచిన రెండేళ్ల కాలంలో ఈ కుట్ర వెనుక ఉన్న అసలైన సూత్రధారులను ఎందుకు పట్టుకోలేదని ఆయన ప్రశ్నించారు. కేవలం కొందరు పోలీస్ అధికారులను అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం వల్ల ప్రయోజనం లేదని, ఆ అధికారులకు ఆదేశాలు ఇచ్చిన రాజకీయ శక్తులను ఎప్పుడు బోనులో నిలబెడతారని ఆయన నిలదీశారు.
బీఆర్ఎస్ - కాంగ్రెస్ లోపాయికారీ ఒప్పందం?
ఈ కేసులో జరుగుతున్న జాప్యం చూస్తుంటే బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య ఏదో రహస్య ఒప్పందం ఉందన్న అనుమానాలు బలపడుతున్నాయని లక్ష్మణ్ పేర్కొన్నారు. ఒకరి తప్పులను మరొకరు కప్పిపుచ్చుకుంటూ, కేవలం ఎన్నికల వేళ రాజకీయ ప్రయోజనాల కోసం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారని విమర్శించారు. తెలంగాణ సమాజం ఈ మోసపూరిత రాజకీయాలను గమనిస్తోందని, నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని, ఈ కేసును ఒక కొలిక్కి తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు.



