మున్సిపల్ పోరులో 'సింహం' గర్జన?
రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. బీఆర్ఎస్ పార్టీకి గుడ్‌బై చెప్పి, సొంత పార్టీ దిశగా అడుగులు వేస్తున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తదుపరి అడుగు ఎటువైపు అనే ఉత్కంఠకు తెరపడుతున్నట్లు కనిపిస్తోంది.
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. బీఆర్ఎస్ పార్టీకి గుడ్‌బై చెప్పి, సొంత పార్టీ దిశగా అడుగులు వేస్తున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తదుపరి అడుగు ఎటువైపు అనే ఉత్కంఠకు తెరపడుతున్నట్లు కనిపిస్తోంది. త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలే లక్ష్యంగా ఆమె వేస్తున్న వ్యూహాలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి.
కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుపై ప్రకటన చేసిన కవిత, ఇంకా పార్టీ పేరును అధికారికంగా ఖరారు చేయలేదు. అయితే, మున్సిపల్ ఎన్నికల నగారా మోగుతున్న వేళ, తన అనుచరులను ఏ గుర్తుపై బరిలోకి దింపాలనే అంశంపై ఆమె ఒక స్పష్టతకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే శుక్రవారం బంజారాహిల్స్‌లోని జాగృతి కార్యాలయంలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (AIFB)నేతలతో కవిత భేటీ కావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.
ఎందుకు 'సింహం' గుర్తుపైనే మోజు?
రాష్ట్రంలో ప్రధాన పార్టీలకు ధీటుగా నిలబడాలంటే ఒక శక్తివంతమైన గుర్తు అవసరమని కవిత భావిస్తున్నారు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి క్షేత్రస్థాయిలో భారీ క్యాడర్ లేకపోయినా, దాని 'సింహం' గుర్తుకు ప్రజల్లో ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. గతంలో రామగుండంలో కోరుకంటి చందర్ ఇదే గుర్తుపై గెలిచి తన సత్తా చాటారు. 2019 పరిషత్ ఎన్నికల్లో ఈ పార్టీ ఏకంగా 25 ఎంపీటీసీలు, 2 జడ్పీటీసీ స్థానాలను గెలుచుకోవడం విశేషం. ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో స్వతంత్ర అభ్యర్థులకు, రెబల్ నేతలకు ఈ 'సింహం' గుర్తు ఒక ఆయుధంగా మారుతోంది.
చట్టసభల్లోకి 'ఒంటరి' పోరాటం!
శాసనమండలిలో తన చివరి ప్రసంగంలో "ఒంటరిగా వెళ్లి తిరుగులేని శక్తిగా తిరిగి వస్తాను" అని ప్రకటించిన కవిత, ఇప్పుడు ఆ మాటను నిలబెట్టుకునే పనిలో పడ్డారు. ఇప్పటికే హైదరాబాద్ నివాసంలో ఆశావహులతో భేటీ అయ్యి, ఎన్నికల సన్నద్ధతపై దిశానిర్దేశం చేశారు. ఒకవేళ ఫార్వర్డ్ బ్లాక్ మద్దతుతో లేదా ఆ పార్టీ బి-ఫారమ్‌లతో జాగృతి నేతలు బరిలోకి దిగితే, అది అధికార, ప్రతిపక్ష పార్టీల ఓటు బ్యాంకుకు గండి కొట్టే అవకాశం ఉంది.
తెలంగాణ రాజకీయాల్లో తన ఉనికిని చాటుకోవాలని చూస్తున్న కవితకు, ఈ 'సింహం' గుర్తు ఏ మేరకు కలిసి వస్తుంది? ప్రజలు ఆమె కొత్త ప్రయాణాన్ని ఎలా ఆదరిస్తారు? అనేది తెలియాలంటే మున్సిపల్ ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే.



