బంగారం దిగుమతులపై ఆందోళన వద్దు: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
భారత ఆర్థిక వ్యవస్థపై బంగారం ధరల ప్రభావం, దిగుమతుల తీరుపై కేంద్ర ప్రభుత్వం కీలక వివరణ ఇచ్చింది.
విశ్వంభర, నేషనల్ బ్యూరో: భారత ఆర్థిక వ్యవస్థపై బంగారం ధరల ప్రభావం, దిగుమతుల తీరుపై కేంద్ర ప్రభుత్వం కీలక వివరణ ఇచ్చింది. బడ్జెట్ అనంతర సంప్రదాయం ప్రకారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బోర్డు డైరెక్టర్లతో భేటీ అయిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అనంతరం విలేకరులతో మాట్లాడారు. దేశంలోకి జరుగుతున్న బంగారం, వెండి దిగుమతులు ఆందోళనకర స్థాయిలో లేవని ఆమె స్పష్టం చేశారు. కరెంట్ ఖాతా లోటుపై వీటి ప్రభావం పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని, ప్రస్తుతం పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని ప్రభుత్వం ధీమా వ్యక్తం చేసింది.
అంతర్జాతీయ కొనుగోళ్లతోనే ధరల సెగ
ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు తమ నిల్వలను పెంచుకోవడానికి పెద్ద ఎత్తున బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయని, ఇదే ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విశ్లేషించారు. మన దేశంలో బంగారం అనేది కేవలం ఆభరణం మాత్రమే కాకుండా ఒక పెట్టుబడి సాధనంగా ఉందని ఆమె గుర్తు చేశారు. పండుగ సమయాల్లో ధరలలో మార్పులు రావడం సహజమేనని, అయితే అవి నిర్దిష్ట పరిమితులను దాటలేదని పేర్కొన్నారు. ఆర్‌బీఐ కూడా ధరల గమనాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తోందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.
అమెరికా టారిఫ్ యుద్ధంపై సమీక్ష
ఇదే సమయంలో అమెరికా విధిస్తున్న కొత్త దిగుమతి సుంకాల (టారిఫ్) అంశంపై కూడా ఆర్థిక మంత్రి స్పందించారు. ట్రంప్ ప్రభుత్వం భారత్‌తో సహా ఇతర దేశాలపై సుంకాలను 10 శాతం నుంచి 15 శాతానికి పెంచడంపై వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ నిశితంగా సమీక్షిస్తోందని తెలిపారు. ఈ అంశంపై ఇప్పుడే ఒక నిర్ణయానికి రావడం లేదా వ్యాఖ్యలు చేయడం తొందరపాటే అవుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. భారత ప్రతినిధుల బృందం తదుపరి చర్చలకు వెళ్లిన తర్వాతే వాణిజ్య పరమైన స్పష్టత వస్తుందని వివరించారు.



