ఖమ్మం జనరల్ ఆసుపత్రిని పరిశీలించిన కలెక్టర్
విశ్వంభర, ఖమ్మం : వారం రోజుల వ్యవధిలో ఆసుపత్రి పారిశుద్ధ్యంలో స్పష్టమైన మార్పు తీసుకుని రావాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ఆదివారం ఖమ్మం జనరల్ ఆసుపత్రి లోని పారిశుద్ధ్య నిర్వహణను 99 రోజుల కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పరిశీలించారు. ఆస్పత్రి సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న క్రిటికల్ కేర్ కేంద్ర భవనం నిర్మాణ పనులను, పార్కింగ్ స్థలం, ఆసుపత్రి పరిసరాలను కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ ఆర్ఎంఓ లు ఆసుపత్రి నిర్వహణ పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, సిబ్బంది హాజరు నుంచి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయా లేదా అనే అంశం వరకు ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని కలెక్టర్ సూచించారు. ఆసుపత్రి వద్ద పార్కింగ్ సక్రమంగా నిర్వహించేందుకు ఒక ఏజెన్సీ గుర్తించి బాధ్యతలు అప్పగించాలని తెలిపారు. 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఆస్పత్రిలో పనికి రాని పాత ఫర్నిచర్, ఎక్విప్మెంట్ పూర్తి స్థాయిలో తొలగించాలని కలెక్టర్ ఆదేశించారు. ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఎక్కడ కూడా చెత్త ఉండటానికి ఆస్కారం ఉండవద్దని అన్నారు. ఖమ్మం జనరల్ ఆసుపత్రికి నిబంధనల ప్రకారం 200 మంది పారిశుద్ధ్య సిబ్బంది ఉన్నప్పటికి ఆసుపత్రి పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటం పట్ల కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మార్చి 15 వరకు చేపట్టే ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ లో భాగంగా ఆసుపత్రిలో స్పష్టమైన మార్పు కనిపించాలని, పారిశుధ్య సిబ్బందికి సరిగ్గా డ్యూటీ కేటాయిస్తూ ఫలితాలు వచ్చేలా చూడాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట నగర మేయర్ పునుకొల్లు నీరజ, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కమీషనర్ అభిషేక్ అగస్త్య, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహ్రా, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రామారావు, డిసిహెచ్ఎస్ డా. రాజశేఖర్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. నరేందర్, ఆర్ఎంఓ డా. రాంబాబు, డా. రాజేంద్రప్రసాద్, వైద్య అధికారులు, సిబ్బంది, తదితరులు ఉన్నారు.



