ఆమెకు అఫైర్లు ఉన్నాయి..!!
విశ్వంభర, నేషనల్ బ్యూరో: ఒలింపిక్ పతక విజేత, భారత బాక్సింగ్‌కు ప్రతీకగా నిలిచిన మేరీ కోమ్‌పై ఆమె మాజీ భర్త కరుంగ్ ఓన్‌ఖోలర్ (ఓన్లెర్) తీవ్ర ఆరోపణలు చేశారు.
విశ్వంభర, నేషనల్ బ్యూరో: ఒలింపిక్ పతక విజేత, భారత బాక్సింగ్‌కు ప్రతీకగా నిలిచిన మేరీ కోమ్‌పై ఆమె మాజీ భర్త కరుంగ్ ఓన్‌ఖోలర్ (ఓన్లెర్) తీవ్ర ఆరోపణలు చేశారు. తనపై మేరీ కోమ్ చేసిన ఆర్థిక మోసాల ఆరోపణలు పూర్తిగా అసత్యమని ఆయన ఖండించారు. కోట్ల రూపాయల డబ్బు, భూమి వ్యవహారాల్లో తాను మోసం చేశానన్న వ్యాఖ్యలకు ఆధారాలు చూపాలని సవాల్ విసిరారు. ఈ అంశాలపై ఐఏఎన్ఎస్ వార్తా సంస్థతో ప్రత్యేకంగా మాట్లాడిన ఓన్లెర్, తొలిసారిగా తన వాదనను బహిరంగంగా వెల్లడించారు.
మేరీ కోమ్‌కు వివాహేతర సంబంధాలు ఉన్నాయని, వాటికి సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని ఓన్లెర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2013లో ఒక జూనియర్ బాక్సర్‌తో, అలాగే 2017 నుంచి మేరీ కోమ్ బాక్సింగ్ అకాడమీలో పనిచేసే మరో వ్యక్తితో ఆమెకు సన్నిహిత సంబంధం ఉందని ఆరోపించారు. ఇందుకు సంబంధించిన వాట్సాప్ సందేశాలు తన వద్ద ఉన్నప్పటికీ, ఇన్నేళ్లుగా కుటుంబ పరువు దృష్ట్యా మౌనం పాటించినట్లు తెలిపారు. తాము విడిగా జీవిస్తూ ఆమె మరో సంబంధం పెట్టుకోవాలనుకుంటే తనకు అభ్యంతరం లేదని, కానీ తనపై ఆధారంలేని ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు.
ఆర్థిక వ్యవహారాలపై మాట్లాడుతూ, మేరీ కోమ్ తనపై రూ.5 కోట్ల వరకు దోచుకున్నానని ఆరోపిస్తున్నారని ఓన్లెర్ పేర్కొన్నారు. అయితే తన బ్యాంకు ఖాతాలను పరిశీలిస్తే వాస్తవం బయటపడుతుందని, ప్రస్తుతం తాను ఢిల్లీలో అద్దె ఇంట్లోనే నివసిస్తున్నానని చెప్పారు. తన పేరు మీద ఆస్తులు ఉన్నాయని చెబితే, వాటికి సంబంధించిన పత్రాలు ఎక్కడున్నాయో చూపించాలని ఆయన ప్రశ్నించారు.
తనను అవసరాల కోసం వాడుకుని తరువాత పక్కన పెట్టేశారంటూ ఓన్లెర్ ఆవేదన వ్యక్తం చేశారు. మేరీ కోమ్ బాక్సింగ్ అకాడమీ స్థాపనలో తాను కీలక పాత్ర పోషించానని, అకాడమీకి సంబంధించిన రిజిస్ట్రేషన్ సహా అనేక వ్యవహారాలు తానే చూసుకున్నానని చెప్పారు. పిల్లలు తన రక్త సంబంధంతో పుట్టినవారని, వారి విషయంలో తనను దూరం పెట్టడం బాధ కలిగిస్తోందన్నారు. తనను మద్యపానానికి అలవాటు పడ్డవాడిగా చిత్రీకరిస్తున్నారని, అయితే పార్టీల్లో ఇద్దరూ కలిసి మద్యం సేవించిన సందర్భాలు ఉన్నాయని తెలిపారు. ఈ విషయాలను తాను ఎప్పుడూ బహిరంగంగా చెప్పలేదని స్పష్టం చేశారు.
మేరీ కోమ్, ఓన్లెర్‌లు 2005లో వివాహం చేసుకోగా, వారికి నలుగురు పిల్లలు ఉన్నారు. వ్యక్తిగత విభేదాలు తలెత్తడంతో 2023లో వారు విడాకులు తీసుకున్నారు. తాజాగా ఇరు వర్గాల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు జాతీయ స్థాయిలో చర్చకు దారి తీస్తున్నాయి.




