ఇండిగోకు డీజీసీఏ షాక్
సేవల అంతరాయంపై కఠిన ఆదేశాలు
గతేడాది డిసెంబర్‌లో దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సర్వీసుల్లో తలెత్తిన భారీ అంతరాయంపై భారత పౌర విమానయాన నియంత్రణ సంస్థ (DGCA) సీరియస్ అయింది. ఈ వైఫల్యాలపై సమగ్ర విచారణ చేపట్టిన నియంత్రణ సంస్థ.. తాజాగా ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ (ఇండిగో)కు కీలక ఆదేశాలను జారీ చేసింది.
విశ్వంభర, నేషనల్ బ్యూరో: గతేడాది డిసెంబర్‌లో దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సర్వీసుల్లో తలెత్తిన భారీ అంతరాయంపై భారత పౌర విమానయాన నియంత్రణ సంస్థ (DGCA) సీరియస్ అయింది. ఈ వైఫల్యాలపై సమగ్ర విచారణ చేపట్టిన నియంత్రణ సంస్థ.. తాజాగా ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ (ఇండిగో)కు కీలక ఆదేశాలను జారీ చేసింది. డీజీసీఏ నుంచి అందిన ఆదేశాలను అమలు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఇండిగో బోర్డు ఆదివారం అధికారికంగా ప్రకటించింది. ప్రయాణికులకు ఎదురైన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, నియంత్రణ సంస్థ సూచించిన మార్గదర్శకాలను తప్పకుండా పాటిస్తామని, లోపాలను త్వరితగతిన సరిదిద్దుతామని సంస్థ చైర్మన్, బోర్డు డైరెక్టర్లు వాటాదారులకు, ప్రయాణికులకు భరోసా ఇచ్చారు.
సర్వీసుల నిలిపివేతకు దారితీసిన సాంకేతిక, నిర్వహణ లోపాలపై ఇండిగో ఇప్పటికే అంతర్గత విచారణను వేగవంతం చేసింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తమ అంతర్గత వ్యవస్థల సామర్థ్యాన్ని పెంచుతామని సంస్థ తెలిపింది. సుమారు రెండు దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర కలిగిన తమ సంస్థ.. ఈ చేదు అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుని మరింత పటిష్టంగా సేవలందిస్తుందని యాజమాన్యం పేర్కొంది. 2030 నాటికి భారతదేశాన్ని ప్రపంచ విమానయాన హబ్‌గా మార్చాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యంలో తాము కీలక భాగస్వాములుగా ఉంటామని ఇండిగో స్పష్టం చేసింది. నాణ్యమైన సేవలు, భద్రత విషయంలో రాజీ పడబోమని ప్రయాణికులకు హామీ ఇచ్చింది.



