అంతరిక్ష వీరుడికి ‘అశోక చక్ర’

అంతరిక్ష వీరుడికి ‘అశోక చక్ర’

భారత గగనతల యోధుడు, అంతరిక్షంలో మువ్వన్నెల జెండాను రెపరెపలాడించిన వ్యోమగామి శుభాంశు శుక్లాను దేశం అత్యున్నత సైనిక పురస్కారం ‘అశోక చక్ర’తో గౌరవించనుంది.

విశ్వంభర, నేషనల్ బ్యూరో: భారత గగనతల యోధుడు, అంతరిక్షంలో మువ్వన్నెల జెండాను రెపరెపలాడించిన వ్యోమగామి శుభాంశు శుక్లాను దేశం అత్యున్నత సైనిక పురస్కారం ‘అశోక చక్ర’తో గౌరవించనుంది. శాంతి కాలంలో ఇచ్చే అత్యున్నత సాహస పురస్కారానికి ఆయన ఎంపికైనట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. సోమవారం ఢిల్లీలోని కర్తవ్య పథ్‌లో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో రాష్ట్రపతి చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు.

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ISS) వెళ్లిన తొలి భారతీయ వ్యోమగామిగా శుభాంశు శుక్లా చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. గతేడాది చేపట్టిన యాక్సియం-4 మిషన్‌లో భాగంగా ఆయన అంతరిక్షంలో అద్భుతమైన పరిశోధనలు చేశారు. శూన్య గురుత్వాకర్షణ స్థితిలో మానవ కండరాలకు జరిగే నష్టంపై కీలక ప్రయోగాలు నిర్వహించారు. అంతరిక్షంలో మానవ జీర్ణ వ్యవస్థ తీరుతెన్నులపై ప్రత్యేక వీడియోను చిత్రీకరించడంతో పాటు, వ్యోమగాముల మానసిక ఆరోగ్యంపై లోతైన అధ్యయనం చేశారు. అమెరికాకు చెందిన పెగ్గీ విట్సన్, పోలండ్, హంగేరీ వ్యోమగాములతో కలిసి ఆయన ఈ మిషన్‌లో పాలుపంచుకున్నారు.

Read More  దీదీని సాగనంపే సమయం వచ్చింది: ప్రధాని మోదీ

అశోక చక్ర విశిష్టత
సాధారణంగా యుద్ధ క్షేత్రంలో ప్రదర్శించే సాహసానికి 'పరమ వీర చక్ర' ఇస్తే.. యుద్ధం లేని సమయంలో అత్యున్నత ధైర్యసాహసాలు, అంకితభావం కనబరిచిన వారికి 'అశోక చక్ర' ప్రదానం చేస్తారు. అంతరిక్షం లాంటి అత్యంత క్లిష్టమైన, ప్రమాదకరమైన మిషన్‌లో పాల్గొని, భారతదేశం తరపున సరికొత్త రికార్డులు నెలకొల్పినందుకు గాను శుక్లాను ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు సమాచారం.