నిబంధనలు పాటించాలి
విశ్వంభర, నిజామాబాద్: హోలీ పండుగను పురస్కరించుకొని జిల్లా ప్రజలు పోలీసులు సూచించిన నిబంధనలు పాటించాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ప్రకటన విడుదల చేశారు. ఇష్టం లేకపోతే రంగులు చల్లవద్దు.. కొంతమంది హోలీ పండుగ సందర్భంగా రహదారులపై, బహిరంగ ప్రదేశాల్లో వాహనదారులపై, పాదచారులపై రంగులు చల్లుతున్నారన్నారు. ఇలా ఇష్టం లేకుండా ఇతరులపైరంగులు చల్లడాన్ని నిషేధించామన్నారు. కాబట్టి శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా ప్రవర్తించవద్దని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వ్యక్తులపై నిజామాబాద్ పోలీస్ చట్టంలోని సెక్షన్ 76 ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ఈనెల 2వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి 5వ తేదీ ఉదయం 6 గంటల వరకు నిబంధనలు అమలులో ఉంటాయని ఉత్తర్వులు జారీ చేశారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో హోలీ సందర్భంగా ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీపీ సాయిచైతన్య తెలిపారు. నగరంలోని ముఖ్యమైన ప్రాంతాల్లో పోలీసుల నిఘా ఏర్పాటు చేశామని.. మద్యం సేవించి వాహనాలపై ఇష్టారాజ్యంగా తిరగవద్దని ఆయన సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.



