పొగాకు ఉత్పత్తులపై ప్రభుత్వం నిషేధం

పొగాకు ఉత్పత్తులపై ప్రభుత్వం నిషేధం

పొగాకు రహిత రాష్ట్రంగా ఒడిశాను తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

విశ్వంభర, నేషనల్ బ్యూరో: పొగాకు రహిత రాష్ట్రంగా ఒడిశాను తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా నికోటిన్ కలిగిన గుట్కా, పాన్ మసాలా వంటి ప్రాణాంతక ఉత్పత్తుల తయారీ, విక్రయాలపై తక్షణమే పూర్తిస్థాయి నిషేధం విధిస్తూ ఒడిశా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు గుట్కా, పాన్ మసాలా, జర్ధా, ఖైనీ, నికోటిన్ కలిగిన పొగాకు ఉత్పత్తుల తయారీ, నిల్వ, రవాణా, విక్రయాలపై నిషేధం విధించింది.

ఒడిశాలో ప్రజారోగ్యంపై నిర్వహించిన ఒక తాజా సర్వేలో విస్తుపోయే నిజాలు వెల్లడయ్యాయి. ఒడిశాలో సుమారు 42 శాతానికి పైగా పౌరులు సిగరెటేతర పొగాకు ఉత్పత్తులను వాడుతున్నట్లు తేలింది. దేశవ్యాప్త సగటుతో పోలిస్తే ఒడిశాలో ఈ వినియోగం ప్రమాదకర స్థాయిలో ఉండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. నోటి క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు ఈ ఉత్పత్తులే ప్రధాన కారణమని వైద్య నిపుణులు హెచ్చరించిన నేపథ్యంలో సర్కార్ అప్రమత్తమైంది.

Read More నౌకాయానంలో భారత్ ఘనత

ప్రభుత్వ విజ్ఞప్తి
"పౌరుల ఆరోగ్యాన్ని కాపాడటమే మా మొదటి ప్రాధాన్యత. పొగాకు వల్ల కలిగే అనర్థాలను గుర్తించి, ప్రజలందరూ వీటికి దూరంగా ఉండాలి. పొగాకు రహిత ఒడిశా నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి" అని ఆరోగ్య శాఖ తన నోటిఫికేషన్‌లో విజ్ఞప్తి చేసింది. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించింది.

Related Posts