అజిత్‌ పవార్‌ విమాన ప్రమాదానికి కారణమిదే

 అజిత్‌ పవార్‌ విమాన ప్రమాదానికి కారణమిదే

 మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురైన ఘటనపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు

విశ్వంభర, నేషనల్ బ్యూరో:  మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురైన ఘటనపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన ప్రాథమిక వివరాలను ఆయన వెల్లడిస్తూ, ప్రమాద కారణాలపై లోతైన దర్యాప్తునకు ఆదేశించామని తెలిపారు. బారామతి విమానాశ్రయంలో ల్యాండింగ్ కావాల్సిన సమయంలో చోటుచేసుకున్న పరిణామాలను వివరించారు. 

ప్రమాదం జరిగిన సమయంలో బారామతి ఎయిర్‌పోర్టు పరిసరాల్లో విజిబులిటీ అత్యంత తక్కువగా ఉందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. రన్‌వే స్పష్టంగా కనిపిస్తుందా? లేదా? అని బారామతి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) అధికారులు పైలట్లను ఆరా తీసినట్లు పేర్కొన్నారు. మొదట రన్‌వే కనిపించడం లేదని పైలట్ల నుంచి సమాచారం రావడంతో, విమానాన్ని కాసేపు గాల్లోనే చక్కర్లు కొట్టాలని సూచించినట్లు పేర్కొన్నారు. కాసేపటి తర్వాత రెండోసారి ల్యాండింగ్‌కు ప్రయత్నించినప్పుడు.. రన్‌వే కనిపిస్తోందని పైలట్లు సానుకూలంగా స్పందించారని చెప్పారు. దీంతో ఏటీసీ క్లియరెన్స్ ఇచ్చిందన్నారు. అయితే, ల్యాండింగ్ అవుతున్న క్రమంలోనే ఊహించని విధంగా విమానం కూలిపోయిందని రామ్మోహన్ నాయుడు తెలిపారు.

Read More  బీజేపీతో పొత్తుండదు.. కమలం సైద్ధాంతిక శత్రువు..!!

రంగంలోకి దర్యాప్తు బృందాలు
ఈ ఘటనపై పారదర్శకమైన విచారణ జరుపుతామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. "ఇది అత్యంత దురదృష్టకరమైన ఘటన. దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు కోసం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA), ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) బృందాలు ఇప్పటికే పుణె చేరుకున్నాయి. సాంకేతిక లోపమా లేక వాతావరణ పరిస్థితులే ప్రధాన కారణమా అనే కోణంలో విచారణ సాగుతోంది." అని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.

'మేడే' కాల్స్ రాలేదు: డీజీసీఏ
మరోవైపు డీజీసీఏ వర్గాలు ఈ ప్రమాదంపై కీలక విషయాలను వెల్లడించాయి. విమానం ప్రమాదానికి గురయ్యే ముందు పైలట్ల నుంచి ఎటువంటి 'మేడే' కాల్స్ (అత్యవసర ప్రాణాపాయ స్థితిలో చేసే పిలుపు) అందలేదని తెలిపాయి. కేవలం వాతావరణం అనుకూలించకపోవడం వల్ల రన్‌వేను గుర్తించడంలో పైలట్లు ఇబ్బంది పడ్డారని ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం. ప్రస్తుతం సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.