రాత్రికి రాత్రే 70 అడుగుల వంతెన మాయం
దొంగలు సాధారణంగా ఇళ్లలో బంగారం, నగదు ఎత్తుకెళ్లడం చూస్తుంటాం. కానీ ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లాలో మాత్రం దొంగలు ఏకంగా ఒక భారీ వంతెననే మాయం చేసి అధికారులను, స్థానికులను విస్మయానికి గురిచేశారు.
విశ్వంభర, నేషనల్ బ్యూరో: దొంగలు సాధారణంగా ఇళ్లలో బంగారం, నగదు ఎత్తుకెళ్లడం చూస్తుంటాం. కానీ ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లాలో మాత్రం దొంగలు ఏకంగా ఒక భారీ వంతెననే మాయం చేసి అధికారులను, స్థానికులను విస్మయానికి గురిచేశారు. హస్డియో ఎడమ కాలువపై ఉన్న 40 ఏళ్ల నాటి స్టీల్ వంతెన ఇప్పుడు కేవలం రికార్డుల్లోనే మిగిలింది.
జనవరి 17 రాత్రి ఈ దొంగతనం జరిగింది. సుమారు 15 మంది దుండగులు పక్కా ప్లాన్‌తో వచ్చి ఈ ఘనకార్యానికి పాల్పడ్డారు. నిందితులు భారీ గ్యాస్ కట్టర్లను ఉపయోగించి 70 అడుగుల పొడవైన వంతెన రెయిలింగ్‌లను, స్టీల్ భాగాలను ముక్కలు ముక్కలుగా కట్ చేశారు. దాదాపు 10 టన్నులకు పైగా బరువున్న ఈ స్టీల్‌ను వాహనాల్లో తరలించి స్క్రాప్‌గా విక్రయించేందుకు ప్లాన్ చేశారు.
జనవరి 18 ఉదయం నిద్రలేచిన ధోధిపారా గ్రామస్థులు కాలువ వైపు చూసి షాక్‌కు గురయ్యారు. నిన్నటి వరకు ఉన్న వంతెన ఆనవాళ్లు కూడా లేకుండా పోవడంతో స్థానిక కార్పొరేటర్ లక్ష్మణ్ శ్రీవాస్‌కు సమాచారం అందించారు. ఆయన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. పోలీసుల దర్యాప్తులో ఈ కేసులో కీలక పురోగతి లభించింది. ఇప్పటివరకు లోచన్ కేవత్, జైసింగ్ రాజ్‌పుత్ సహా ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు ఇచ్చిన సమాచారంతో కాలువలో దాచిన 7 టన్నుల ఉక్కును, తరలించేందుకు వాడిన వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాకు నాయకత్వం వహించిన ముఖేష్ సాహు, అస్లాం ఖాన్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు అదనపు ఎస్పీ లఖన్ పాటిల్ తెలిపారు.



