దేవభూమిలో హిందువులకు మాత్రమే ప్రవేశం
ఉత్తర భారతదేశంలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన బద్రీనాథ్, కేదార్‌నాథ్ ఆలయాల ప్రవేశ నిబంధనల్లో భారీ మార్పులు రాబోతున్నాయి.
విశ్వంభర, నేషనల్ బ్యూరో: ఉత్తర భారతదేశంలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన బద్రీనాథ్, కేదార్‌నాథ్ ఆలయాల ప్రవేశ నిబంధనల్లో భారీ మార్పులు రాబోతున్నాయి. ఇకపై ఈ క్షేత్రాల్లోకి హిందువులను మాత్రమే అనుమతించాలని బద్రీనాథ్-కేదార్‌నాథ్ టెంపుల్ కమిటీ నిర్ణయించింది. హిందూయేతరుల ప్రవేశంపై నిషేధం విధించాలని కమిటీ ప్రతిపాదించింది. త్వరలో జరగబోయే బోర్డు సమావేశంలో దీనిపై అధికారిక ముద్ర పడనుంది. ఈ ప్రతిపాదనను బద్రీనాథ్-కేదార్‌నాథ్ టెంపుల్ కమిటీ ఛైర్మన్ హేమంత్ ద్వివేది ధ్రువీకరించారు. కేవలం ఈ రెండు ప్రధాన ఆలయాలే కాకుండా, కమిటీ పరిధిలోని మిగతా అన్ని దేవాలయాలకు కూడా ఈ నిబంధన వర్తిస్తుందని స్పష్టం చేశారు.
దేవభూమిగా పేరుగాంచిన సుప్రసిద్ధ గంగోత్రి ధామ్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఆదివారం జరిగిన శ్రీ గంగోత్రి ఆలయ కమిటీ సుప్రసిద్ధ గంగోత్రి ధామ్‌లో హిందూయేతరుల ప్రవేశాన్ని నిషేధిస్తూ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు అదే బాటలో బద్రీ-కేదార్ ఆలయాలు కూడా పయనిస్తున్నాయి. అయితే, ఈ కొత్త నిబంధనలు ఎప్పటినుంచి అమల్లోకి తెస్తారన్న విషయాన్ని మాత్రం ఇంకా నిర్ణయించలేదు.
ఉత్తరాఖండ్‌లోని చార్‌ధామ్ యాత్రలో భాగమైన ఈ ఆలయాలను ఏటా లక్షలాది మంది భక్తులు సందర్శిస్తారు. శీతాకాలం నేపథ్యంలో ఆరు నెలల పాటు మూసి ఉంచిన బద్రీనాథ్ ఆలయ ద్వారాలను ఏప్రిల్ 23న తెరవనున్నారు. ఇక, గంగోత్రి, యమునోత్రి ఆలయాలు అక్షయ తృతీయను పురస్కరించుకుని ఏప్రిల్ 19న తెరుచుకోనున్నాయి. ఈ కొత్త నిబంధనల అమలు తేదీపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఏటా లక్షలాది మంది భక్తులు సందర్శించే ఈ హిమాలయ ధామాల్లో ఈ నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.



