కోతుల గుప్పిట్లో మోత్కూర్.. అడుగు తీసి అడుగు వేయాలంటే భయం..
విశ్వంభర, మోత్కూర్: యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ పట్టణం ప్రస్తుతం కోతుల గుంపుల దాడితో అల్లాడిపోతోంది. గత కొన్ని రోజులుగా పట్టణంలో కోతుల సంఖ్య విపరీతంగా పెరగడమే కాకుండా, అవి మనుషులపై దాడులకు తెగబడుతుండటంతో స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఉదయం లేవగానే వందల సంఖ్యలో కోతులు వీధుల్లో తిష్ట వేస్తుండటంతో అడుగు బయట పెట్టాలంటేనే జనం వణికిపోతున్నారు.గతంలో ఎన్నడూ లేని విధంగా కోతులు నేరుగా నివాస గృహాలపైకి చేరుతున్నాయి. మిద్దెలపై ఆడుకుంటున్న పిల్లలపై, పని నిమిత్తం బయటకు వచ్చే మహిళలపై ఒక్కసారిగా విరుచుకుపడుతున్నాయి. ఇప్పటికే కోతుల దాడిలో గాయపడి చాలామంది ఆసుపత్రుల పాలయ్యారు. ఇళ్లలోకి జొరబడి ఆహార పదార్థాలను ఎత్తుకెళ్తున్నాయి. గృహాల కిటికీలు, తలుపులు ఎప్పుడూ మూసి ఉంచుకోవాల్సి వస్తోందని, స్వంత ఇంట్లోనే ఖైదీల్లా బతకాల్సి వస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారులకు, అటవీ శాఖ అధికారులకు. రాజకీయ నాయకులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పరిస్థితిలో మార్పు రాలేదని స్థానికులు మండిపడుతున్నారు. ప్రస్తుతం కొలువుదీరిన నూతన మున్సిపల్ పాలకవర్గం ఈ సమస్యను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. నూతన పాలకవర్గ సభ్యులు ప్రత్యేక శ్రద్ధ చూపి, అటవీ శాఖ అధికారులతో మాట్లాడి కోతులను పట్టించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.



