నేనే వెనెజువెలా అధ్యక్షుడిని: ట్రంప్ ప్రకటన..!!
విశ్వంభర, నేషనల్ బ్యూరో: వెనెజువెలా రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా అంతర్జాతీయ స్థాయిలో సంచలనంగా మారాయి.
విశ్వంభర, నేషనల్ బ్యూరో: వెనెజువెలా రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా అంతర్జాతీయ స్థాయిలో సంచలనంగా మారాయి. వెనెజువెలా అధ్యక్షుడు నికొలస్ మదురోను అమెరికా బలగాలు బలవంతంగా అరెస్ట్ చేసి ఫ్లోరిడాకు తరలించిన నేపథ్యంలో, ఆ దేశంలో అధికార ఖాళీ ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో వెనెజువెలా ఉపాధ్యక్షురాలు డెల్సి రోడ్రిగ్జ్ తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలు చేపట్టినట్లు అక్కడి రక్షణమంత్రి ప్రకటించారు. ఆమె 90 రోజుల పాటు దేశ పాలనను నిర్వహిస్తారని స్పష్టం చేశారు.
ఈ పరిణామాల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. తాజాగా ఆయన తన ‘ట్రూత్ సోషల్’ ఖాతాలో ఒక సంచలన పోస్టు చేశారు. వెనెజువెలా అధ్యక్షుడు తానేనని సూచించేలా ఒక ఎడిటెడ్ చిత్రాన్ని షేర్ చేశారు. వికీపీడియా పేజీని పోలి ఉన్న ఆ చిత్రంలో, డొనాల్డ్ ట్రంప్‌ను వెనెజువెలా యాక్టింగ్ ప్రెసిడెంట్‌గా చూపించారు. ఆ ఫొటోలో ఈ ఏడాది జనవరి నుంచి తాత్కాలిక అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టినట్లు పేర్కొనడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది.
మదురో అరెస్టు అనంతరం వెనెజువెలా దేశానికి శాశ్వత అధ్యక్షుడు ఎవరు అవుతారు అన్న అంశంపై తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో వెనెజువెలా ప్రతిపక్ష నేత, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మారియా కొరీనా మచాడోకు అమెరికా మద్దతు ఇస్తుందని ప్రచారం జరిగింది. అయితే ఈ వాదనలను ట్రంప్ ఖండించారు. మచాడోకు ప్రజల్లో తగిన మద్దతు లేదని, అందుకే ఆమెకు అధ్యక్ష బాధ్యతలు అప్పగించే ప్రశ్నే లేదని ఆయన స్పష్టంగా చెప్పారు.
ఈ నేపథ్యంలో ట్రంప్ చేసిన తాజా ప్రకటన, ఆయన షేర్ చేసిన ఎడిటెడ్ చిత్రం అంతర్జాతీయ రాజకీయాల్లో కొత్త చర్చలకు దారితీస్తోంది. వెనెజువెలా పరిస్థితి ఏ మలుపు తిరుగుతుందో, అమెరికా తదుపరి అడుగులు ఏమిటన్నది ఇప్పుడు ప్రపంచం మొత్తం ఆసక్తిగా గమనిస్తోంది.



