నేను ఎంతకాలం ఉంటానో తెలియదు: ట్రంప్‌

నేను ఎంతకాలం ఉంటానో తెలియదు: ట్రంప్‌

విశ్వంభర, నేషనల్ బ్యూరో:  తనపై జరుగుతోన్న వరుస హత్యాయత్నాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు. తనను హత్య చేయడానికి చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారని.. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే తాను ఎంత కాలం ఉంటానో కూడా తెలియట్లేదన్నారు. ఇటువంటి షూటర్లు సాధారణ అధ్యక్షుల జోలికి వెళ్లరని.. కేవలం అసాధారణ విజయాలు సాధించే అధ్యక్షులనే లక్ష్యంగా చేసుకుంటారని అన్నారు. ఈ సందర్భంగా అమెరికా మాజీ అధ్యక్షులు అబ్రహం లింకన్‌, జాన్‌ ఎఫ్‌. కెన్నడీ హత్య ఘటనలను ఉదాహరణగా పేర్కొన్నారు. ఇలాంటి ఎన్ని బెదిరింపులకు పాల్పడినా.. తాను తీసుకునే నిర్ణయాలపై ఏ మాత్రం వెనక్కి తగ్గబోనన్నారు. ఇటీవల ఫ్లోరిడాలోని తన నివాసంలోకి ఓ సాయుధ దుండగుడు చొరబడిన ఘటనపై స్పందిస్తూ ట్రంప్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.శనివారం అర్ధరాత్రి సమయంలో ఓ దుండగుడు ఫ్లోరిడాలోని ట్రంప్‌ నివాసంలోకి ప్రవేశించాడు. అతడి చేతిలో ఆయుధంతోపాటు ఇంధనం క్యాన్‌ ఉన్నట్లు సీక్రెట్‌ సర్వీస్‌ ఏజెంట్లు గుర్తించారు. వాటిని కిందపడేయాలని హెచ్చరించినా ఆ దుండగుడు వినకపోవడంతో భద్రతా సిబ్బంది అతడిని హతమార్చారు. కాగా.. ట్రంప్‌పై గతంలోనూ పలుమార్లు హత్యాయత్నాలు  జరిగిన విషయం తెలిసిందే. 2024 జులైలో ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆయనపై ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు. ఆ ఘటనలో ట్రంప్‌ చెవి భాగం నుంచి తూటా దూసుకెళ్లింది. ఆ తర్వాత ఓసారి ట్రంప్‌ పామ్‌ బీచ్‌ గోల్ఫ్‌ కోర్స్‌లో రైఫిల్‌తో అనుమానాస్పదంగా ఉన్న ఓ వ్యక్తినీ పోలీసులు అరెస్టు చేశారు.

Tags: