బ్రిటన్ సైన్యంపై ట్రంప్ 'యూటర్న్'
అంతర్జాతీయ వేదికపై మిత్రదేశాలతో 'మాటల యుద్ధం' సాగిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అఫ్గాన్ యుద్ధం విషయంలో స్వరం మార్చారు.
విశ్వంభర బ్యూరో: అంతర్జాతీయ వేదికపై మిత్రదేశాలతో 'మాటల యుద్ధం' సాగిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అఫ్గాన్ యుద్ధం విషయంలో స్వరం మార్చారు. నాటోదేశాలపై నిప్పులు చెరిగిన కొద్ది రోజులకే.. బ్రిటన్ సైన్యాన్ని ఆకాశానికెత్తుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. యూకే సైనికులు అత్యంత ధైర్యవంతులని, అమెరికాకు వారు ఎల్లప్పుడూ వెన్నెముకలా నిలుస్తారని ఆయన ప్రశంసించారు.
వివాదం నేపథ్యం ఇదీ..
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. అఫ్గానిస్థాన్ యుద్ధంలో అమెరికా సేనలు మాత్రమే ముందున్నాయని, నాటో దేశాలు తమకు అవసరమైనప్పుడు ముఖం చాటేశాయని విమర్శించారు. "మాకు నాటో దేశాల అవసరం లేదు" అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు పశ్చిమ దేశాల్లో తీవ్ర దుమారాన్ని రేపాయి. ముఖ్యంగా బ్రిటన్ ప్రధాని కియర్ స్టార్మర్ దీనిపై తీవ్రంగా స్పందించారు. అఫ్గాన్‌లో ప్రాణత్యాగం చేసిన తమ సైనికులను ట్రంప్ అవమానించారని, ఆయన తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ట్రూత్ సోషల్ లో 'డ్యామేజ్ కంట్రోల్'
బ్రిటన్ నుంచి వ్యక్తమైన నిరసనలతో ట్రంప్ తన విమర్శల నుంచి వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది. తన సొంత సోషల్ మీడియా వేదిక 'ట్రూత్ సోషల్'లో ఆయన ఒక సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. అఫ్గాన్ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన 457 మంది యూకే సైనికులు, తీవ్రంగా గాయపడిన వేలమంది సైనికులను ఆయన 'గొప్ప యోధులు'గా అభివర్ణించారు. అమెరికా-బ్రిటన్ దేశాల మధ్య ఉన్న సైనిక సంబంధం విచ్ఛిన్నం చేయలేనంత బలంగా ఉందని పేర్కొన్నారు. బ్రిటన్ సైన్యం చేసిన త్యాగాలను తాను గౌరవిస్తానని, వారి కృషిని ఎవరూ తక్కువ చేయలేరని స్పష్టం చేశారు.



