బండ్ల గణేష్ 'మహా పాదయాత్ర'
విశ్వంభర ఏపీ బ్యూరో: సినీ రంగంలో తనదైన శైలిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్, ఇప్పుడు తన రాజకీయ అభిమానాన్ని చాటుకోవడానికి సిద్ధమయ్యారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్షేమం కోసం తాను గతంలో పెట్టుకున్న మొక్కును తీర్చుకునేందుకు ఆయన 'మహా పాదయాత్ర'కు శ్రీకారం చుట్టారు. షాద్‌నగర్‌లోని తన నివాసం నుంచి తిరుమల కొండల వరకు వందలాది కిలోమీటర్ల మేర కాలినడకన సాగే ఈ యాత్ర ఇప్పుడు రాజకీయ, సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
గతంలో స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన సమయంలో, ఆ పరిణామాలను చూసి బండ్ల గణేష్ తీవ్రంగా చలించిపోయారు. ఆ సమయంలోనే ఆయన తిరుమల వేంకటేశ్వర స్వామిని వేడుకున్నారు. “చంద్రబాబు ఎటువంటి మచ్చ లేకుండా, క్షేమంగా బయటకు రావాలి.. ఆయన విడుదలైన తర్వాత నేను కాలినడకన వచ్చి దర్శించుకుంటాను” అని శ్రీవారికి మొక్కుకున్నారు. చంద్రబాబు కేవలం విడుదల అవ్వడమే కాకుండా, ప్రజా తీర్పుతో అఖండ విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. తన కోరిక నెరవేరిన తృప్తితో బండ్ల గణేష్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈనెల 19వ తేదీన షాద్‌నగర్‌లోని తన స్వగృహం వద్ద బండ్ల గణేష్ ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తన అభిమానులు, సన్నిహితులు, టీడీపీ శ్రేణుల సమక్షంలో ఈ పాదయాత్ర మొదలవుతుంది. యాత్ర పొడవునా పలుచోట్ల అన్నదాన కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నుంచి ప్రారంభమై, ఉమ్మడి మహబూబ్ నగర్, కర్నూలు, కడప మీదుగా చివరకు చిత్తూరు జిల్లాలోని తిరుమల గిరులకు ఈ యాత్ర చేరుకుంటుంది. అనంతరం తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోనున్నారు.



