సాగర తీరాన నౌకాదళ పరాక్రమం

సాగర తీరాన నౌకాదళ పరాక్రమం

భారత నౌకాదళ చరిత్రలో మరో అద్భుతమైన ఘట్టం విశాఖపట్నం తీరంలో ఆవిష్కృతమైంది. భారత సాయుధ దళాల సర్వసైన్యాధ్యక్షురాలు, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము బుధవారం నిర్వహించిన 'ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (IFR-2026)' భారత నావికాదళ పెరుగుతున్న సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పింది.

విశ్వంభర, ఏపీ బ్యూరో: భారత నౌకాదళ చరిత్రలో మరో అద్భుతమైన ఘట్టం విశాఖపట్నం తీరంలో ఆవిష్కృతమైంది. భారత సాయుధ దళాల సర్వసైన్యాధ్యక్షురాలు, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము బుధవారం నిర్వహించిన 'ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (IFR-2026)' భారత నావికాదళ పెరుగుతున్న సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పింది. ఐఎన్ఎస్ సుమేధను 'ప్రెసిడెన్షియల్ యాట్'గా మలిచి, అందులో రాష్ట్రపతి ప్రయాణిస్తూ తీరంలో లంగరు వేసిన యుద్ధనౌకలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో 45 భారతీయ నౌకలతో పాటు, 19 విదేశీ యుద్ధనౌకలు, కోస్ట్ గార్డ్, మర్చంట్ నేవీ నౌకలు పాల్గొని సాగర తీరాన్ని రక్షణ కవచంలా మార్చేశాయి. సముద్ర అలలపై నౌకలు, జలాంతర్గాములు చేసిన కవాతు, ఆకాశంలో నౌకాదళ విమానాలు చేసిన ఫ్లైపాస్ట్ వీక్షకులను మంత్రముగ్ధులను చేశాయి.

సాహస విన్యాసాలతో హోరెత్తిన సాగరం
ఈ సమీక్షలో భాగంగా భారత నేవీ అత్యున్నత శిక్షణకు నిదర్శనంగా నిలిచే పలు ప్రదర్శనలు జరిగాయి. మార్కోస్ కమాండోలు అత్యంత వేగంగా నిర్వహించిన పోరాట విన్యాసాలు, హెలికాప్టర్ల ద్వారా చేపట్టిన సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్లు ఉత్కంఠను రేకెత్తించాయి. 'యునైటెడ్ త్రూ ఓషన్స్' (సముద్రాల ద్వారా ఏకత్వం) అనే నినాదంతో సాగిన ఈ ఉత్సవం, అంతర్జాతీయ జలాల్లో శాంతిని, సహకారాన్ని పెంపొందించడమే లక్ష్యంగా సాగింది. సముద్రం ద్వారా ఒకరితో ఒకరు అనుసంధానమై ఉన్నామనే సందేశాన్ని ఇస్తూ, వివిధ దేశాల జెండాలతో యుద్ధనౌకలు బారులు తీరిన దృశ్యం ప్రపంచ దేశాల మధ్య ఉన్న మైత్రికి చిహ్నంగా నిలిచింది. ఈ చారిత్రక ఘట్టానికి ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి కె.రామ్మోహన్ నాయుడు సాక్ష్యంగా నిలిచారు.

Read More చైనా, పాక్ మనకంటే ముందున్నాయి:ఆర్మీ చీఫ్

'మహాసాగర్' విజన్.. ప్రపంచానికే మార్గదర్శి
సమీక్ష అనంతరం రాష్ట్రపతి ప్రసంగిస్తూ.. భారతదేశం ఎప్పుడూ 'వసుధైవ కుటుంబకం' స్ఫూర్తిని నమ్ముతుందని, సముద్ర భద్రతలో ప్రపంచ దేశాలన్నీ పరస్పర సహకారంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ దార్శనికతకు నిదర్శనమైన 'మహాసాగర్' విజన్‌ను ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇది కేవలం రక్షణకే పరిమితం కాకుండా, అందరి అభివృద్ధి, భద్రతను కోరుకుంటుందని స్పష్టం చేశారు. విపత్తు సమయాల్లో భారత నౌకాదళం ఎల్లప్పుడూ ముందుంటుందని, ప్రాంతీయ స్థిరత్వాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశంసించారు. మిత్ర దేశాల నౌకాదళాలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం పరస్పర విశ్వాసానికి నిదర్శనమని రాష్ట్రపతి పేర్కొన్నారు.