అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాలి
విశ్వంభర, సిద్దిపేట: నిజమైన అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. గ్రామ సభల్లో సంక్షేమ పథకాల వారీగా ప్రభుత్వం చేకూరుస్తున్న లబ్ధిని ప్రజలకు వివరించాలని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలెక్టర్లతో మంగళవారం కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక సూచనలు, సలహాలు చేశారు. ప్రజా ప్రభుత్వంలో అందిస్తున్న రేషన్ కార్డులు, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇండ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ లబ్ధిదారుల అభిప్రాయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. విద్యా వ్యవస్థలో ప్రజా ప్రభుత్వం తీసుకొస్తున్న మార్పులపై ప్రజలకు అవగాహన కల్పించాలని, ప్రభుత్వ ఆస్పత్రులను పటిష్టం చేసేందుకు సమీపంలోని మెడికల్ కాలేజీలకు అనుసంధానం చేయాలని ఆదేశించారు. తద్వారా ప్రజలకు మెరుగైన వైద్యం అందిచేలా చర్యలు తీసుకోవాలన్నారు. మధ్యాహ్న భోజనం ఏజెన్సీలకు ప్రతీ నెల బిల్లుల చెల్లింపులు కచ్చితంగా అందేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. 99 రోజుల ప్రోగ్రాంలో గ్రామ స్థాయి నుంచి జిల్లా వరకు ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలన్నారు. కాన్ఫరెన్స్ లో జిల్లా నుంచి కలెక్టర్ హైమావతితో పాటు అధికారులు పాల్గొన్నారు.



