ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య

విశ్వంభర,  బీబీనగర్: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వివాహిత తన ఇద్దరు పిల్లల ఊపిరి తీసి, తానూ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మెట్టినింటి వేధింపులే కారణమని సూసైడ్‌ నోట్‌లో పేర్కొంది. ఈ విషాద ఘటన మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌ మండలం గొల్లగూడెంలో చోటుచేసుకుంది. భువనగిరి డీఎస్పీ రవీందర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మేకల మహేష్‌కు వలిగొండ మండలం వేములకొండ గ్రామానికి చెందిన ఐశ్వర్య(28)తో నాలుగేళ్ల కిందట వివాహమైంది. వీరికి ఝాన్సీ(2), పండు(10 నెలలు) ఇద్దరు పిల్లలు.రెండేళ్ల కిందట భార్య, భర్తల మధ్య గొడవ జరిగింది. ఐశ్వర్య సోదరులు వచ్చి బావను వలిగొండ పోలీస్టేషన్‌లో అప్పగించి సోదరిని, ఆమె కూతురు ఝాన్సీని వెంట తీసుకెళ్లారు. అప్పుడు ఐశ్వర్య రెండు నెలల గర్భిణి. అప్పటి నుంచి ఆమె తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. తనను కొట్టి అవమానించారని మహేష్‌ భార్య, బిడ్డను చూడటానికి ఎప్పుడూ వెళ్లలేదు. కొడుకు పుట్టాడని తెలిసినా.. అటు వైపు చూడలేదు. మహేష్‌ రైల్వేలో ట్రాక్‌మెన్‌గా పనిచేస్తూ వికారాబాద్‌లోని శంకర్‌పల్లిలో నివాసముంటున్నాడు.సోమవారం ఐశ్వర్య పెద్దమ్మ, పెద్దనాన్నలు ఇద్దరు పిల్లలతో సహా ఆమెను గొల్లగూడెం తీసుకొచ్చి అత్తారింట్లో అప్పగించి వెళ్లారు. ఇదిలా ఉండగా రాత్రి అత్తామామలకు భోజనం పెట్టి అందరూ తిన్నాక ఐశ్వర్య తన గదిలో ఇద్దరు పిల్లలతో కలిసి నిద్రపోయింది. మంగళవారం తెల్లవారుజామున మహేష్‌ తల్లి గది తలుపులు తీసి చూడగా ఐశ్వర్య చీరతో ఉరివేసుకొని, పిల్లలు మంచంపై విగతజీవులుగా పడి ఉండటాన్ని గమనించి.. గ్రామస్థుల సాయంతో పోలీసులకు సమాచారమిచ్చారు.ఘటన స్థలాన్ని డీఎస్పీ రవీందర్‌ పరిశీలించారు. ఐశ్వర్య గదిలో సూసైడ్‌ నోట్‌ లభించిందని.. భర్త, అత్తామామలు, ఇద్దరు ఆడపడుచుల వేధింపులు తాళలేకే తన పిల్లలను చంపి తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు అందులో పేర్కొందని తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు.

Tags: