అవాస్తవాలు మాట్లాడొద్దు..ప్రజలు గుణపాఠం చెబుతారు

అవాస్తవాలు మాట్లాడొద్దు..ప్రజలు గుణపాఠం చెబుతారు

విశ్వంభర, హైదరాబాదు : ఖమ్మం పట్టణంలోని వెలుగుమట్ల గ్రామంలో భూదాన భూముల్లో దాదాపు పది సంవత్సరాలుగా నివసిస్తున్న సుమారు 700 కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం వేలాది మంది పోలీసులతో, బుల్డోజర్‌లతో బలవంతంగా ఖాళీ చేయించి ఇండ్లను కూల్చివేసిందని సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ఒక ప్రకటనలో ఆరోపించారు. బాధిత కుటుంబాలు ఇప్పటికీ రోడ్డుపై నిరసనలు తెలుపుతున్నాయని తెలిపారు. ఈ ఘటనపై కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ చేసిన వ్యాఖ్యలను అవాస్తవమని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎంపీ శ్యామల కిరణ్‌కుమార్ రెడ్డి పేర్కొనడం సరైంది కాదని ప్రకటనలో పేర్కొన్నారు. వెలుగుమట్లలో జరిగిన విధ్వంసం, కుటుంబాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు రాష్ట్ర ప్రజలకు తెలిసిందేనని తెలిపారు. శిబిరాల్లో ఉన్న వారికి కనీస సౌకర్యాలు కూడా లేవని మీడియాలో వచ్చిన కథనాలు స్పష్టం చేస్తున్నాయని పేర్కొన్నారు. అక్కడికి వెళ్లిన మీడియా ప్రతినిధులను అరెస్టు చేసి నిర్బంధించడం ఆందోళనకరమని తెలిపారు. ఖమ్మం జిల్లాలో సీపీఎం, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పోరాటాలు కొనసాగుతున్నాయని, ఈ వాస్తవాలను విస్మరించి ఊహాగానాలతో మాట్లాడటం సమంజసం కాదని ప్రకటనలో పేర్కొన్నారు. వెలుగుమట్లలోని పేదలకు అదే స్థలంలో ఇండ్లు నిర్మించి స్థిర నివాసం కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రజలను మభ్యపెట్టే విధంగా అవాస్తవాలు ప్రచారం చేస్తే ప్రజలు తప్పకుండా గుణపాఠం చెబుతారని, ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తే తెలంగాణలో ప్రజలు తగిన సమాధానం ఇస్తారని సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ స్పష్టం చేసింది.

Tags: