ఇస్నాపూర్ వైస్ చైర్మన్ పదవికి గండం
- మాధవి నరేందర్ రెడ్డిపై అనర్హత వేటు
- కాంగ్రెస్ విప్ ధిక్కరణపై కలెక్టర్ సీరియస్..
- అభ్యర్థిత్వం రద్దు చేస్తూ ఉత్తర్వులు
- పార్టీ ఫిరాయింపుదారులకు హెచ్చరిక.. కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు
విశ్వంభర, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా రాజకీయాల్లో సంచలనం చోటుచేసుకుంది. ఇస్నాపూర్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్, 8వ వార్డు కౌన్సిలర్ మాధవి నరేందర్ రెడ్డిపై జిల్లా కలెక్టర్ అనర్హత వేటు వేశారు. పార్టీ ఫిరాయింపులు, విప్ ధిక్కరణ అంశాలపై సుదీర్ఘ విచారణ అనంతరం ఆమె అభ్యర్థిత్వాన్ని రద్దు చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో మున్సిపల్ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.గత మున్సిపల్ ఎన్నికల సమయంలో మాధవి నరేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరపున 8వ వార్డు నుండి పోటీ చేసి ఘన విజయం సాధించారు. అయితే, రాష్ట్రంలో మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఆమె కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. అప్పట్లో ఈ మార్పు స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.మున్సిపల్ కౌన్సిల్ సమావేశాల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జారీ చేసిన విప్‌ను ఆమె బేఖాతరు చేశారని, పార్టీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని స్థానిక కాంగ్రెస్ నాయకత్వం జిల్లా కలెక్టర్‌కు మరియు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసింది. పార్టీ గుర్తుపై గెలిచి, పార్టీ ఆదేశాలను ఉల్లంఘించడం రాజ్యాంగ విరుద్ధమని కాంగ్రెస్ తన ఫిర్యాదులో పేర్కొంది.ఈ ఫిర్యాదును స్వీకరించిన జిల్లా కలెక్టర్, దీనిపై క్షుణ్ణంగా విచారణ జరిపారు. రెండు పార్టీల వాదనలు విన్న అనంతరం, మాధవి నరేందర్ రెడ్డి కాంగ్రెస్ విప్‌ను ధిక్కరించినట్లు ఆధారాలతో సహా నిరూపితమైంది. దీంతో మున్సిపల్ చట్టం ప్రకారం ఆమె కౌన్సిలర్ పదవితో పాటు, వైస్ చైర్మన్ పదవికి కూడా అనర్హురాలని కలెక్టర్ ప్రకటించారు. ఆమె అభ్యర్థిత్వాన్ని రద్దు చేస్తూ తక్షణమే అమలులోకి వచ్చేలా ఆదేశాలు ఇచ్చారు.కలెక్టర్ నిర్ణయం వెలువడగానే ఇస్నాపూర్‌లో కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. ప్రధాన చౌరస్తాలో బాణసంచా కాల్చి, స్వీట్లు పంచుకున్నారు.ఎప్పటికైనా ధర్మానిదే విజయం" అని, పదవుల కోసం పార్టీలు మారే వారికి ఈ తీర్పు ఒక గుణపాఠమని కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడినందుకు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.



