సీఎం రేవంత్‌తో మాజీ మావోయిస్టు అగ్రనేతల భేటీ
సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మాజీ మావోయిస్టు నేతలు దేవ్ జీ అలియాస్ తిప్పిరి తిరుపతి, సుజాతక్క, మల్లా రాజిరెడ్డి, చంద్రన్న, నూనె నరసింహారెడ్డి తదితరులు కలిశారు.
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మాజీ మావోయిస్టు నేతలు దేవ్ జీ అలియాస్ తిప్పిరి తిరుపతి, సుజాతక్క, మల్లా రాజిరెడ్డి, చంద్రన్న, నూనె నరసింహారెడ్డి తదితరులు కలిశారు. అడవి బాట వీడి సమాజంలో కలిసిన తమకు ప్రభుత్వం నుంచి అందాల్సిన తోడ్పాటుపై వీరు విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా అగ్రనేతలు నేరుగా ముఖ్యమంత్రితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఒకవైపు ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో ఆపరేషన్ కగార్ పేరుతో బలగాలు విరుచుకుపడుతుంటే, మరోవైపు తెలంగాణ ప్రభుత్వం మాత్రం శాంతియుత మార్గానికి ప్రాముఖ్యత ఇస్తోంది. మావోయిస్టులు ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలవాలని, వారికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా పునరుద్ఘాటించినట్లు సమాచారం.
పునరావాస ప్యాకేజీపై కసరత్తు
లొంగిపోయిన నేతలకు ఇళ్ల స్థలాలు, పిల్లల చదువు, ఉపాధి వంటి అంశాలపై అధికారులు ఇప్పటికే ఒక నివేదిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో జరిగిన ఈ చర్చల్లో, మాజీ నక్సలైట్లు ఎదుర్కొంటున్న న్యాయపరమైన ఇబ్బందులను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. త్వరలోనే వీరందరి కోసం ఒక సమగ్రమైన 'సంక్షేమ ప్యాకేజీ'ని ప్రకటించే సూచనలు కనిపిస్తున్నాయి.



